పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో మరోసారి చిక్కుల్లో పడ్డ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(Ganguly News).. ఏటీకే మోహన్ బగన్ ఫ్రాంచైజీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడిగా వైదొలగనున్నట్లు తెలుస్తోంది. ఆర్పీఎస్జీ వెంచర్స్ అధినేత సంజీవ్ గోయంకాకు ఐపీఎల్ ఫ్రాంఛైజీ దక్కినందున గంగూలీపై విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో దాదా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
"భారత్‌లో బాగా పాపులర్ అయిన ఫుట్‌బాల్ క్లబ్‌లలో మోహన్ బగన్ ఒకటి. ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లోనూ ఇది భాగమే. అయితే.. గంగూలీ ఈ ఫ్రాంచైజీ బోర్డులో సభ్యుడు మాత్రమే కాదు. అతడు ఇందులో షేర్హోల్డర్గానూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో గంగూలీ కీలక పదవి నుంచి వైదొలిగేందుకు సన్నాహాలు చేస్తున్నాడు." అని ఓ క్రీడా సంస్థ తెలిపింది.
కీలకంగా వ్యవహరించారా?
ఐపీఎల్లో రెండు కొత్త ఫ్రాంచైజీల కోసం ఇటీవల జరిగిన వేలంలో(IPL franchise auction) అహ్మదాబాద్‌ను రూ.5,625 కోట్లకు సీవీసీ క్యాపిటల్స్ పార్టనర్స్ సొంతం చేసుకోగా.. లఖ్‌నవూను(IPL new teams) రూ.7,090 కోట్లతో ఆర్పీఎస్జీ వెంచర్స్ అధినేత సంజీవ్ గోయంకా దక్కించుకున్నారు. అయితే సంజీవ్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీ దక్కడంలో గంగూలీ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇండియన్ సూపర్ లీగ్‌లో(ఐఎస్ఎల్) సంజీవ్ గోయంకా ఛైర్మన్‌గా ఉన్న ఏటీకే-మోహన్ బగన్ ఫ్రాంచైజీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌లో గంగూలీ సభ్యుడుగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.
గతేడాది జూన్‌లో ఏటీకే క్లబ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడుగా గంగూలీ ఎంపికయ్యాడు. ఇందులో ఉత్సవ్ పరేఖ్, శ్రిన్జోయ్ బోస్, దెబాశిష్ దత్తా, గౌతమ్ రేయ్, సంజీవ్ మెహ్రా సభ్యులుగా ఉన్నారు.
గంగూలీపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన ఓ బీసీసీఐ సీనియర్ అధికారి.. "ఇది వివాదాస్పద అంశమని స్పష్టంగా తెలుస్తోంది. గంగూలీ.. బీసీసీఐ అధ్యక్షుడని అర్థం చేసుకోవాలి. అతను ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు" అని పేర్కొన్నాడు.
పరస్పర విరుద్ధ ప్రయోజనాల విషయమై గంగూలీతో అనుబంధం గురించి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన గోయంక.. అతను (గంగూలీ) మెహన్ బగన్ నుంచి పూర్తిగా తప్పకున్నారని తెలిపారు. అయితే ఎప్పుడు జరిగిందని ప్రశ్నించగా.. మంగళవారం(అక్టోబరు 26) జరిగిందని అన్నారు. తర్వాత సారీ అంటూ.. 'ఈ విషయాన్ని గంగూలీ చెప్పాలి. అయితే నేనే ముందుగా చెప్పాను" అని అన్నాడు. అయితే ఆ తర్వాత కూడా.. మెహన్ బగన్ నుంచి వైదొలుగుతున్నట్లు గంగూలీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది ఐపీఎల్ ఫ్రాంచైజీ వేలంలో గోయంకాకు దాదా సాయం చేసినట్లు వస్తున్న ఆరోపణలకు బలం చేకూరుస్తుంది. అయితే ఈ విషయమై గంగూలీ స్పందించాల్సి ఉంది.
ఇదీ చదవండి: