శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ సెంచరీ సచిన్ రికార్డను బ్రేక్ చేశాడు. దీంతో వన్డే సెంచరీల సంఖ్యను 45కి చేరింది. అలాగే సచిన్ (20) స్వదేశంలో సాధించిన శతకాల సంఖ్యను సమం చేశాడు. ఈ క్రమంలో సచిన్, విరాట్.. వీరిద్దరిలో ఎవరు గొప్ప బ్యాటర్? అనే చర్చ కొనసాగుతోంది. వారి రికార్డులను, ఆటను పోల్చడం సరైంది కాదని ఇప్పటికే గౌతమ్ గంభీర్ వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కూడా ఇదే విషయంపై స్పందించాడు.
"అయితే ఇలా సచిన్, విరాట్‌లో ఎవరు గొప్ప అనే ప్రశ్నే చాలా క్లిష్టమైంది. కోహ్లీ అద్భుతమైన ఆటగాడు. ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. లేకపోతే వన్డేల్లోనే 45 శతకాలు సాధించడం సాధారణ విషయం కాదు. అతడిలో ప్రత్యేకమైన ప్రతిభ ఉంది. కొన్ని సమయంలో పరుగులు చేయలేదు.. కానీ, విరాట్ కీలక ప్లేయర్" అని గంగూలీ తెలిపాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లు కలిపి 73 శతకాలను సాధించాడు. వన్డేల్లో 45 కాగా.. మరో టెస్టుల్లో 27 శతకాలు ఉన్నాయి. గతేడాది ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌పై తొలిసారి టీ20 ఫార్మాట్‌లో సెంచరీ కొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే సచిన్ వంద శతకాల రికార్డునూ అధిగమించడం ఖాయమనే వాదనలూ వినిపిస్తున్నాయి.
సచిన్, కోహ్లీకి తేడా ఇదే.. వన్డేల్లో సచిన్ ఆడినప్పుడు... ఇప్పటికి రూల్స్ కొన్ని మారిన విషయం తెలిసిందే. రెండు కొత్త బంతులు, సర్కిల్ ఆవల ఐదుగురు ఫీల్డర్లు, పవర్ ప్లే.. ఇలా నిబంధనల్లో చాలా మార్పులు వచ్చాయి. అయినప్పటికీ సచిన్, కోహ్లీ ఆటతీరు మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే సచిన్ ఎక్కువగా ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ, కోహ్లీ వన్‌డౌన్‌లో జట్టు బరువు బాధ్యతలను మోయాల్సి వచ్చేది. ఈ క్రమంలో సచిన్ 463 వన్డేల్లో 49 శతకాలు సాధించగా.. విరాట్ 266 వన్డేల్లోనే 45 శతకాలు నమోదు చేయడం విశేషం. అయితే సచిన్ ఖాతాలో 96 హాఫ్ సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి. విరాట్ అత్యధిక స్కోరు 183. ఇప్పటి వరకు 64 అర్ధశతకాలను సాధించాడు.
ఇదీ చూడండి: 'వన్డేల్లో కోహ్లీ 45 సెంచరీలు.. ఇప్పుడున్న ఆటగాళ్ల ఊహకు కూడా అందదు'