ఆస్ట్రేలియాలోని గబ్బా స్టేడియాన్ని పునర్ నిర్మించాలని క్వీన్స్లాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై చేసిన అధికారిక ప్రకటనను క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు క్వీన్స్లాండ్ క్రికెట్ స్వాగతించాయి. 2032 ఒలింపిక్స్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ మైదానాన్ని తిరిగి కట్టాలని నిర్ణయించారు.
పునర్ నిర్మాణం తర్వాత గబ్బా స్టేడియం రాబోయే తరాలకు ప్రపంచ స్థాయి క్రికెట్ వేదికగా మారుతుందనడంలో సందేహామే లేదు. దేశంలోని అతి ముఖ్యమైన, చరిత్ర కలిగిన క్రికెట్ మైదానాల్లో గబ్బా ఒకటి. 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్‌లో భాగంగా ఈ స్టేడియం పునర్ నిర్మాణానికి క్వీన్స్లాండ్ ప్రభుత్వం అంగీకరించడం సంతోషంగా ఉంది.
-నిక్ హాక్లీ, క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈఓ.
ఇదీ చదవండి: ఐరోపా ఫుట్‌బాల్‌లో చీలిక.. కొత్తగా సూపర్ లీగ్
"2000 ఒలింపిక్స్ సందర్భంగా ఆస్ట్రేలియా స్టేడియం, సిడ్నీ మైదానాలు వారసత్వంగా మిగిలిపోయాయి. అప్పటి నుంచి ఈ రెండు స్టేడియాలు అంతర్జాతీయ క్రికెట్ వేదికలుగా మారాయి. ఇప్పుడు గబ్బా కూడా ఇదే విధంగా అలాగే తయారవుతుంది. ప్రపంచంలోని ఏ స్టేడియానికి తీసిపోకుండా ముస్తాబవుతుంది" అని నిక్ హాక్లీ పేర్కొన్నారు.
గత కొంతకాలంగా పెద్ద వేదికలు పునర్ నిర్మాణానికి నోచుకోవడం క్రికెట్ ఆస్ట్రేలియాకు మంచి పరిణామమని హాక్లీ పేర్కొన్నారు. ఆ జాబితాలో ప్రస్తుతం గబ్బా కూడా చేరుతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు.
ఇదీ చదవండి: షెడ్యూల్ ప్రకారమే డబ్ల్యూటీసీ ఫైనల్: ఐసీసీ