India Australia T20 Series : టీ20 ప్రపంచకప్‌నకు ముందు రిహార్సల్స్.. బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్‌ను సెట్‌ను చేసుకోవడానికి భారత్‌కు మంచి తరుణం. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం తొలి మ్యాచ్ జరగనుంది. సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి కోలుకొని వచ్చాడు. అలాగే యువ బౌలర్ హర్షల్ పటేల్ కూడా జట్టుతో చేరాడు. వీరిద్దరూ టీ20 ప్రపంచకప్ జట్టులోనూ ఉన్నారు. దీంతో చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగుతున్న బుమ్రా, పటేల్ ఎలా రాణిస్తారనేది వేచి చూడాలి. ప్రపంచకప్ నాటికి బౌలింగ్ లయను అందుకోవాలని భారత్ ఆశిస్తోంది.
ఇక ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కూడా భారీ ఇన్నింగ్స్‌లు ఆడాల్సిన అవసరం ఉంది. విరాట్ కోహ్లీ ఇప్పటికే ఫామ్ అందుకొని ఉండటం టీమ్ఇండియాకు సానుకూలాంశం. సూర్యకుమార్, హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్/దినేశ్ కార్తిక్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడి చాలాకాలమైంది. తుది జట్టు కూర్పుపై దృష్టి పెట్టాలి. బుమ్రా, హర్షల్, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్‌తో బౌలింగ్ దళం పటిష్ఠంగానే ఉంది. భారత్-ఆస్ట్రేలియా జట్ల విజయాపజయాలు 13-9గా ఉంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో సిరీస్ ఫుల్ షెడ్యూల్, ఇరు జట్లు, లైవ్ ఎక్కడ చూడొచ్చు.. అనే విషయాలను తెలుసుకుందాం..
షెడ్యూల్ ఇదే..
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు టీ20లు జరుగుతాయి. తొలి మ్యాచ్ సెప్టెంబర్ 20 (మంగళవారం) మొహాలీ వేదికగా జరుగుతుంది. అలాగే రెండో టీ20 మ్యాచ్ నాగ్‌పుర్ వేదికగా సెప్టెంబర్ 23 (శుక్రవారం), చివరి టీ20 హైదరాబాద్ వేదికగా సెప్టెంబర్ 25 (ఆదివారం)న జరగనుంది. ప్రతి మ్యాచ్ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. స్టార్‌స్పోర్ట్స్, డిస్నీ+హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో వీక్షించే అవకాశం ఉంది.
జట్ల వివరాలు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, బుమ్రా, దీపక్ చాహర్, హర్షల్ పటేల్
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇగ్లిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, డానియల్ సామ్స్, స్టీవ్ స్మిత్, మ్యాథ్యూ వేడ్, ఆడమ్ జంపా
ఇవీ చదవండి : అలయా.. మాళవిక.. సోనాలి.. ఇంత అందం మీకెక్కడిదమ్మా?
'నా పిల్లల కన్నా మోదీనే ఇష్టం'.. స్టార్ నటుడి తల్లి పోస్ట్.. కంగన రియాక్షన్ ఇదే!