టిమ్ డేవిడ్.. రొమారియో షెపర్డ్.. బ్రెవిస్..! యశ్ దయాళ్.. వైభవ్ అరోరా.. అభినవ్ మనోహర్..! ఇప్పటిదాకా మన అభిమానులు పెద్దగా వినని పేర్లివి. కానీ ఐపీఎల్ వేలంలో వీళ్లకు పలికిన ధరలు చూసి ఔరా అనుకున్నారంతా! ఇప్పటిదాకా లీగ్‌తో పరిచయమే లేని.. ఒకటీ ఆరా మ్యాచ్‌లు మాత్రమే ఆడిన యువ ఆటగాళ్ల కోసం ఐపీఎల్ ఫ్రాంఛైజీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడి వారిపై కోట్లు పోసేశాయి. తమకు పలికిన ధరకు ఉబ్బితబ్బిబ్బవుతూ.. ఆ ధరకు న్యాయం చేసేలా ఆడి లీగ్‌పై తమదైన ముద్ర వేయాలని చూస్తున్న కొత్త కెరటాలపై ఓ లుక్కేద్దాం రండి.
యశ్ దయాళ్, జట్టు: గుజరాత్
ధర: 3.2 కోట్లు
ఉత్తరప్రదేశ్ రంజీ ఆటగాళ్లతో కలిసి గుర్గావ్‌లో ఉన్న యశ్ దయాళ్ ఆదివారం ఐపీఎల్ వేలం జరుగుతున్నపుడు మొబైల్ సైలెంట్‌లో పెట్టి గంటకు పైగా నిద్ర పోయాడట. లేచి మొబైల్ తీసేసరికి వందల్లో మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వేలంలో రూ.3.2 కోట్లు పలికితే ఆ మాత్రం స్పందన ఉండదా మరి? బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల ఈ యూపీ పేసర్.. విజయ్ హజారెలో 3.77 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ వేలానికి మంచి డిమాండ్‌తో వచ్చాడు. గట్టి పోటీ మధ్య గుజరాత్ టైటాన్స్ అతణ్ని కొనుక్కుంది.
సాయికిశోర్, జట్టు: గుజరాత్
ధర: రూ.3 కోట్లు
తమిళనాడు జట్టులో మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా సత్తా చాటుతున్న బౌలర్లలో స్పిన్నర్ సాయికిశోర్ ఒకడు. తమిళనాడు ప్రిమియర్ లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. మూణ్నాలుగేళ్లుగా అతను దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్నాడు. రంజీలతో పాటు విజయ్ హజారె, ముస్తాక్ అలీ టోర్నీల్లో సత్తా చాటాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో అవకాశం అందుకున్నప్పటికీ తుది జట్లలో ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు అతణ్ని గుజరాత్ జట్టు రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది.
అభివన్ మనోహర్, జట్టు:గుజరాత్
ధర: 2.6 కోట్లు
కర్ణాటక తరఫున దేశవాళీల్లో సత్తా చాటి అయిదేళ్ల కిందటే ముంబయి ఇండియన్స్ ప్రతిభాన్వేషణకు హాజరయ్యాడు అభినవ్ మనోహర్. కానీ సెలక్షన్ ట్రయల్స్‌లో అతడి ఆటను పరిశీలించిన కోచ్‌లు అతను తమ జట్టుకు ఉపయోగపడడని పంపించేశారు. తర్వాత పట్టుదలతో కష్టపడ్డాడు. కర్ణాటక తరఫున అదరగొట్టి ఇప్పుడు వేలంలో రూ.2.6 కోట్ల అనూహ్య ధరతో గుజరాత్ టైటాన్స్ సొంతమయ్యాడు. 27 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్.. పార్ట్ టైం లెగ్ స్పిన్నర్ కూడా.
వైభవ్ అరోరా, జట్టు: పంజాబ్
ధర: రూ.2 కోట్లు
భారత దేశవాళీ క్రికెట్‌ను అనుసరించే వారికి వైభవ్ అరోరా పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. హిమాచల్ ప్రదేశ్ లాంటి చిన్న జట్టు.. దేశవాళీల్లో అనూహ్య ప్రదర్శన చేసిందంటే అందులో వైభవ్ అరోరా పాత్ర కీలకం. తమిళనాడు లాంటి పెద్ద జట్టుకు షాకిస్తూ నిరుడు విజయ్ హజారె ట్రోఫీని గెలిచి సంచలనం సృష్టించింది హిమాచల్. ఆ టోర్నీలో వైభవ్ ఆకట్టుకున్నాడు. రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతను అందుకు పది రెట్ల ధరతో పంజాబ్ సొంతమయ్యాడు.
తిలక్ వర్మ, జట్టు: ముంబయి
ధర: రూ.1.7 కోట్లు
ఈసారి ఐపీఎల్ వేలంలో అందరి దృష్టినీ ఆకర్షించిన యువ ఆటగాళ్లలో మనవాడూ ఒకడున్నాడు. అతనే హైదరాబాదీ ఆల్‌రౌండర్ తిలక్ వర్మ. రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతను.. రూ.1.7 కోట్లకు ముంబయి జట్టుకు సొంతం కావడం విశేషం. 2020 అండర్-19 ప్రపంచకప్‌తో అతను వెలుగులోకి వచ్చాడు. గత సీజన్‌లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 147.26 స్ట్రైక్‌రేట్‌తో 215 పరుగులు చేసి ఫ్రాంఛైజీల దృష్టిలో పడ్డాడు.
టిమ్ డేవిడ్, జట్టు: ముంబయి
ధర: రూ.8.25 కోట్లు
ఐపీఎల్‌లోకి రావడానికి ముందే సింగపూర్ ఆటగాడు టిమ్ డేవిడ్ టీ20 లీగ్స్‌లో మంచి పేరే తెచ్చుకున్నాడు. అతను బిగ్ బాష్ సహా చాలా టీ20 లీగ్స్‌లో అదరగొట్టాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో నిమిషాల్లో మ్యాచ్ ఫలితాలు మార్చేయగల సత్తా అతడి సొంతం. గత ఏడాదే బెంగళూరు జట్టు అతడికి అవకాశమిచ్చింది. ఒక్క మ్యాచే ఆడాడు. వేలానికి ముందు బిగ్ బాష్, పీఎస్‌ఎల్‌లో అదరగొట్టడంతో అతడికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.గట్టి పోటీ మధ్య ముంబయి అతణ్ని రూ.8.25 కోట్లకు దక్కించుకుంది.
రొమారియో షెపర్డ్, జట్టు: హైదరాబాద్
ధర: రూ.7.75 కోట్లు
ఆల్‌రౌండర్లకు నెలవైన వెస్టిండీస్ జట్టులో బంతితో, బ్యాటుతో మెరుపులు మెరిపిస్తూ ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిలో పడ్డ ఆటగాడు రొమారియో షెపర్డ్. మామూలుగా అతను బ్యాటింగ్ చేసేది లోయరార్డర్లోనే కానీ.. బ్యాటుతో అతడి సత్తా చూసి అప్పుడప్పుడూ టాప్‌ఆర్డర్లో కూడా దించుతుంటుంది విండీస్ జట్టు. మంచి వేగంతో బంతులేసే ఈ ఫాస్ట్‌బౌలర్.. కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతుంటాడు. ఏకంగా రూ.7.75 కోట్లతో సన్‌రైజర్స్ సొంతమయ్యాడు.
ఒడియన్ స్మిత్, జట్టు: పంజాబ్
ధర: రూ.6 కోట్లు
వెస్టిండీస్ జట్టులో ఈ మధ్య చర్చనీయాంశం అవుతున్న ఆటగాడు ఒడియన్ స్మిత్. తాజాగా భారత్‌తో వన్డే సిరీస్‌లోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. మీడియం పేస్‌తో వికెట్లు పడగొట్టడంతో పాటు లోయర్ మిడిలార్డర్లో ధాటిగా ఆడుతూ విలువైన పరుగులే చేసే ఈ కరీబియన్ కుర్రాడి కోసం ఐపీఎల్ ఫ్రాంఛైజీల గట్టిగా పోటీపడ్డాయి. చివరికి పంజాబ్ అతణ్ని రూ.6 కోట్లకు దక్కించుకుంది.
బ్రెవిస్, జట్టు: ముంబయి
ధర: రూ.3 కోట్లు
బేబీ డివిలియర్స్.. దక్షిణాఫ్రికా యువ కెరటం బ్రెవిస్‌కు అభిమానులు పెట్టిన ముద్దు పేరు. ఏబీ తర్వాత ఆ స్థాయికి చేరుకోగల సామర్థ్యం ఉన్న బ్యాట్స్‌మన్‌గా అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇటీవలి అండర్-19 వన్డే ప్రపంచకప్‌తో అతడి పేరు మార్మోగింది. ఆ టోర్నీలో 506 పరుగులతో టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు బ్రెవిస్. వేలంలో అతడి కోసం బాగానే పోటీ నడిచింది. ముంబయి అతణ్ని రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది.
మార్కో జాన్సన్, జట్టు: హైదరాబాద్
ధర: రూ.4.2 కోట్లు
గత నెలలో ముగిసిన టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రత్యర్థి జట్టులో నిలకడగా రాణించిన బౌలర్లలో మార్కో జాన్సన్ ఒకడు. దాదాపు ఆరున్నర అడుగుల ఎత్తున్న జాన్సన్.. తన ఎత్తును సద్వినియోగం చేసుకుంటూ బంతితో చక్కగా బౌన్స్ రాబడుతూ.. భారత బ్యాట్స్‌మెన్‌కు సవాలు విసిరాడు. ఈ ఆల్‌రౌండ్ మెరుపులే అతడికి వేలంలో రూ.4.2 కోట్లు తెచ్చి పెట్టాయి. బ్యాటుతోనూ సత్తా చాటగల పేసర్ కోసం చూస్తున్న సన్‌రైజర్స్ అతణ్ని సొంతం చేసుకుంది. నిరుడు మంబయి తరఫున అతడు రెండు మ్యాచ్‌లు ఆడాడు.
ఇదీ చూడండి: IPL 2022: వీరిపై అన్ని కోట్లు ఎందుకు పెట్టారో తెలుసా?