ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మెర్గాన్ తన క్రికెట్ కెరీర్‌కి గుడ్‌బై చెప్పాడు. అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి నిష్క్రమిస్తున్నట్లు మెర్గాన్ ప్రకటించాడు. ఈ సందర్భంగా తాన కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.
"అన్ని ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటించడం నాకెంతో గర్వంగా ఉంది. సుదీర్ఘ చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నా. ఇన్నాళ్లు నాకు ఎన్నో అందించిన క్రికెట్ నుంచి వైదొలగడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నా. 2005లో ఇంగ్లాండ్‌కు వెళ్లడం దగ్గర నుంచి మిడిల్‌సెక్స్ జట్టు, దక్షిణాఫ్రికా టీ20 టోర్నీలో పార్ల్ రాయల్స్ జట్ల తరఫున ఆడడం వరకు.. ప్రతి క్షణాన్ని నేనెంతో ఆస్వాదించా. ప్రతి క్రీడాకారుడి కెరీర్ లాగే నా కెరీర్‌లో కూడా హెచ్చుతగ్గులు వచ్చాయి. కానీ ఆ సమయాల్లో నేను నిరుత్సాహ పడకుండా నా కుటుంబ సభ్యులు, స్నేహితుల సలహాలు తీసుకున్నా. వారూ నాకెంతో ప్రోత్సాహం అందించారు. ఈ సందర్భంగా నా కుటుంబం, నా సన్నిహితులతో పాటు నా భార్య తారాకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. వీరితో పాటు నా సహచరులు, కోచ్‌లు, అభిమానులు అలాగే నా ఎదుగుదలకు తోడ్పడిన ప్రతిఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఫ్రాంచైజీ జట్ల కోసం ఆడడం నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. వీటిని నేనెప్పటికీ మరిచిపోను. ఇకపోతే క్రికెట్ ఆటకు ధన్యవాదాలు. దీని కారణంగానే నేను ప్రపంచాన్ని చుట్టొచ్చాను. ఆ క్రమంలో గొప్ప వ్యక్తులను కలవగలిగాను. క్రికెట్‌కు వీడ్కోలు చెప్పినప్పటికీ ఆటతో మాత్రం ఎప్పుడూ టచ్‌లో ఉంటాను. అంతర్జాతీయ, ఫ్రాంచైజీ టోర్నమెంట్‌లలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాను. భవిష్యత్‌లో నా జీవితంలో ఏం జరగబోతుందనే దానికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను."
- ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్
కెరీర్ 13 ఏళ్లు.. కెప్టెన్‌గా ఏడేళ్లు..!
మెర్గాన్ ఐర్లాండ్ జట్టు తరఫున అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. తన 13 ఏళ్ల కెరీర్‌లో ఏడేళ్ల పాటు ఇంగ్లాండ్‌కు కెప్టెన్‌గా సేవలందించాడు. మొత్తంగా ఈ ప్లేయర్ 248 వన్డేలు, 115 టీ20లు, 16 టెస్ట్‌లు ఆడాడు. మెర్గాన్.. సారథ్యంలో ఇంగ్లాండ్ బలమైన వన్డే, టీ20 జట్టుగా ఎదిగింది. మెర్గాన్.. 126 వన్డే, 72 టీ20ల్లో ఇంగ్లాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇతడు కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఇంగ్లాండ్ 2019లో వన్డే ప్రపంచకప్‌ను గెలిచింది. వన్డేల్లో ఈ ప్లేయర్ ఇప్పటివరకు.. 39.29 సగటుతో 14 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలతో 7, 701 పరుగులు చేశాడు. అలాగే టీ20ల్లో 28.58 సగటుతో 14 హాఫ్ సెంచరీలు బాది.. 2,458 పరుగులు సాధించాడు. 16 టెస్టులు ఆడి.. 2 శతకాలు, 3 అర్ధశతకాలతో 700 పరుగులు చేశాడు. 2012లో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇక, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక పరుగుల రికార్డులు మెర్గాన్ పేరిటే ఉన్నాయి.