బ్యాటుతో పూర్తిగా విఫలమైన భారత్ రెండో వన్డేలో 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో పరాజయంపాలైంది. గురువారం మొదట ఇంగ్లాండ్ 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. మొయిన్ అలీ (47; 64 బంతుల్లో 2×4, 2×6), విల్లీ (41; 49 బంతుల్లో 2×4, 2×6) కీలక ఇన్నింగ్స్‌తో తమ జట్టుకు మెరుగైన స్కోరును అందించారు. ఛేదనలో టాప్లీ (6/24) ధాటికి భారత్.. 38.5 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఒక్క బ్యాట్స్‌మనూ నిలవలేకపోయాడు. టాప్లీకి రోహిత్ (10 బంతుల్లో 0) మూడో ఓవర్లోనే వికెట్ల ముందు దొరికిపోవడంతో తొలి వికెట్ చేజార్చుకున్న భారత్.. ఏ దశలోనూ సాధికారికంగా ఆడలేదు. ధావన్‌కు జత కలిసిన కోహ్లి (16; 25 బంతుల్లో 3×4) కొన్ని చక్కని షాట్లు ఆడినా 8 ఓవర్లకు జట్టు స్కోరు 23 పరుగులే. ఆపై వికెట్లు చకచకా పడ్డాయి. 9వ ఓవర్లో ధావన్ (9) ను టాప్లీ ఔట్ చేయగా.. పంత్ ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఖాతా కూడా తెరవలేదు. ఆ వెనుకే కోహ్లి. పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడని ఆశించిన అభిమానులను నిరాశపరుస్తూ అతడు నాలుగో వికెట్‌గా నిష్క్రమించాడు. ఆఫ్‌స్టంప్ ఆవల బంతిని వెంటాడిన కోహ్లి.. ఔట్ సైడ్ ఎడ్జ్‌తో బట్లర్‌కు చిక్కాడు. అప్పటికి భారత్ 31/4. అయితే హార్దిక్ (29; 44 బంతుల్లో 2×4)తో కలిసి సూర్యకుమార్ (27; 29 బంతుల్లో 1×4, 1×6) కాసేపు పతనాన్ని ఆపాడు. కానీ భారత్‌లో ఆశలు చిగురిస్తుండగా సూర్య.. టాప్లీ బౌలింగ్‌లో బౌల్డై జట్టును మరింత కష్టాల్లోకి నెట్టాడు. కాసేపటికే హార్దిక్ నిష్క్రమించడంతో ఆశలు సన్నగిల్లాయి. జడేజా (29; 44 బంతుల్లో 1×4, 1×6), షమి (23; 28 బంతుల్లో 2×4, 1×6) కాసేపు ప్రతిఘటించారు. కానీ అది ఏమాత్రం సరిపోలేదు. భారత్ ఆరు పరుగుల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. చివరిదైన మూడో వన్డే ఆదివారం మాంచెస్టర్‌లో జరుగుతుంది.
ఇంగ్లాండ్ తడబడ్డా..: 246.. ఇంగ్లాండ్‌కిది ఊహించని స్కోరే. ఓ దశలో 102కే అయిదు వికెట్లు చేజార్చుకున్న ఆతిథ్య జట్టు కుప్పకూలేలా కనిపించింది. మొయిన్ అలీ, విల్లీ పోరాటంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. రోహిత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పిచ్‌పై తొలి వన్డేలా పచ్చిక లేదు కానీ బౌలింగ్ దాడిని ఆరంభించిన బుమ్రా, షమి తేమను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఓపెనర్లు జేసన్ రాయ్ (23), బెయిర్‌స్టో (38)లకు సమస్యలు సృష్టించారు. అయితే ఇంగ్లాండ్ పతనాన్ని ఆరంభించింది మాత్రం హార్దికే. అతడు తన తొలి ఓవర్లోనే (ఇన్నింగ్స్ 9వ) జట్టుకు వికెట్‌ను అందించాడు. బుమ్రా, షమి పరీక్షను తట్టుకుని నిలిచిన రాయ్.. హార్దిక్ బంతిని సరిగా ఫ్లిక్ చేయలేక డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్‌లో సూర్యకుమార్‌కు తేలికైన క్యాచ్ ఇచ్చాడు. అది మొదలు ఇంగ్లాండ్ క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది. 15వ ఓవర్లో బెయిర్‌స్టోను చాహల్ బౌల్డ్ చేసే సమయానికి ఇంగ్లాండ్ స్కోరు 72. కాసేపటికే రూట్ (11)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఆ జట్టును మరో దెబ్బతీశాడు చాహల్. రూట్ సమీక్షను కూడా వృథా చేశాడు. తర్వాతి ఓవర్లోనే బట్లర్ (4)ను బౌల్డ్ చేసి ప్రత్యర్థికి షమి షాకిచ్చాడు. 22వ ఓవర్లో స్టోక్స్ (21)ను చాహల్ ఎల్బీగా వెనక్కి పంపడంతో ఇంగ్లాండ్ 102/5తో కష్టాల్లో చిక్కుకుంది. చాహల్ బంతిని రివర్స్‌స్వీప్ ఆడే ప్రయత్నంలో స్టోక్స్ దెబ్బతిన్నాడు. అయితే మరోవైపు మొయిన్ అలీ నిలవగా లివింగ్‌స్టోన్ (33; 33 బంతుల్లో 2×4, 2×6) ధాటిగా ఆడడంతో ఇంగ్లాండ్ పరిస్థితి కాస్త మెరుగైంది. ఆ జోరును భారత్ మరీ ఎక్కువసేపేమీ సాగనివ్వలేదు. ఇన్నింగ్స్ కుదుటపడుతున్న దశలో లివింగ్‌స్టోన్‌ను ఔట్ చేయడం ద్వారా 46 పరుగుల భాగస్వామ్యాన్ని హార్దిక్ విడదీశాడు. ఓ షార్ట్ బంతిని ముందుకొచ్చి పుల్ చేసిన లివింగ్‌స్టోన్ డీప్ స్క్వేర్ లెగ్‌లో శ్రేయస్‌కు చిక్కాడు. 29 ఓవర్లలో 148/6తో నిలిచింది ఇంగ్లాండ్. అయినా 246 పరుగులు చేసిందంటే ప్రధాన కారణం మొయిన్ అలీ, విల్లీల పోరాటమే. ఈ జంట ఏడో వికెట్‌కు 62 పరుగులు జోడించింది. ఎట్టకేలకు 42వ ఓవర్లో అలీని ఔట్ చేయడం ద్వారా ఈ భాగస్వామ్యాన్ని చాహల్ విడదీశాడు. ఆ తర్వాత విల్లీ.. ఒవర్టన్ (10 నాటౌట్)తో ఎనిమిదో వికెట్‌కు 27 పరుగులు జోడించాడు. 9 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చివరి మూడు వికెట్లు చేజార్చుకుంది. నిజానికి ఆతిథ్య జట్టు అంత స్కోరు చేసేదే కాదు. ఆ జట్టును తక్కువ స్కోరుకు పరిమితం చేసే చక్కని అవకాశం భారత్ చేజార్చుకుంది. వ్యక్తిగత స్కోరు ఒకటి వద్ద హార్దిక్ బౌలింగ్‌లో విల్లీ ఇచ్చిన తేలికైన క్యాచ్‌ను ప్రసిద్ధ్ చేజార్చడం ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు ఊపిరి పోసింది. లేదంటే ఇంగ్లాండ్ కథ ఎప్పుడో ముగిసేదే.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ 23; బెయిర్‌స్టో (బి) చాహల్ 38; రూట్ ఎల్బీ (బి) చాహల్ 11; స్టోక్స్ ఎల్బీ (బి) చాహల్ 21; బట్లర్ (బి) షమి 4; లివింగ్‌స్టోన్ (సి) శ్రేయస్ (బి) హార్దిక్ 33; మొయిన్ అలీ (సి) జడేజా (బి) చాహల్ 47; విల్లీ (సి) శ్రేయస్ (బి) బుమ్రా 41; ఒవర్టన్ నాటౌట్ 10; బ్రైడన్ కార్సే ఎల్బీ (బి) ప్రసిద్ధ్ 2; టాప్లీ (బి) బుమ్రా 3; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (49 ఓవర్లలో ఆలౌట్) 246; వికెట్ల పతనం: 1-41, 2-72, 3-82, 4-87, 5-102, 6-148, 7-210, 8-237, 9-240; బౌలింగ్: షమి 10-0-48-1; బుమ్రా 10-1-49-2; హార్దిక్ పాండ్య 6-0-28-2; ప్రసిద్ధ్ కృష్ణ 8-0-53-1; చాహల్ 10-0-47-4; జడేజా 5-0-17-0
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ ఎల్బీ టాప్లీ 0; ధావన్ (సి) బట్లర్ (బి) టాప్లీ 9; కోహ్లి (సి) బట్లర్ (బి) విల్లీ 16; పంత్ (సి) సాల్ట్ (బి) కార్సే 0; సూర్యకుమార్ (బి) టాప్లీ 27; హార్దిక్ (సి) లివింగ్‌స్టోన్ (బి) మొయిన్ 29; జడేజా (బి) లివింగ్‌స్టోన్ 29; షమి (సి) స్టోక్స్ (బి) టాప్లీ 23; బుమ్రా నాటౌట్ 2; చాహల్ (బి) టాప్లీ 3; ప్రసిద్ధ్ (సి) బట్లర్ (బి) టాప్లీ 0; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (38.5 ఓవర్లలో ఆలౌట్) 146, వికెట్ల పతనం: 1-4, 2-27, 3-29, 4-31, 5-73, 6-101, 7-140, 8-140, 9-145, బౌలింగ్: టాప్లీ 9.5-2-24-6; విల్లీ 9-2-27-1; కార్సే 7-0-32-1; ఒవర్ట్‌న్ 7-0-22-0; మొయిన్ అలీ 4-0-30-1; లివింగ్‌స్టోన్ 2-1-4-1
ఇవీ చూడండి