మొతేరా పిచ్‌పై టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ చేసిన ట్వీట్‌లో తప్పేమీ లేదని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పష్టంచేశాడు. ఇటీవల జరిగిన డే/నైట్ టెస్టులో టీమ్‌ఇండియా రెండురోజుల్లోనే విజయం సాధించిన సందర్భంగా మాజీ ఆల్‌రౌండర్ ఆ పిచ్‌పై స్పందిస్తూ ఓ ట్వీట్ చేశాడు.
"రెండు రోజుల్లోనే ఆట పూర్తి అయింది. ఇది టెస్టు క్రికెట్‌కు మంచిదో కాదో తెలియదు. ఒకవేళ ఇలాంటి పిచ్‌లపైనే అనిల్‌కుంబ్లే, హర్భజన్ సింగ్ బౌలింగ్ చేస్తే టెస్టుల్లో వాళ్లు 1000, 800 వికెట్లు సాధించేవాళ్లు"
- యువరాజ్, టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్
అయితే, మరుసటి రోజే అశ్విన్ పలు అర్థంకాని ట్వీట్లు చేయడం వల్ల అవి యువీని ఉద్దేశించే చేశాడని కొందరు నెటిజెన్లు పోస్టులు చేశారు. ఈ నేపథ్యంలోనే శనివారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా అశ్విన్ తన ట్వీట్లపై స్పష్టతనిచ్చాడు. తనకు యువరాజ్‌పై చాలాకాలం నుంచి తెలుసని, అతడంటే ఎంతో గౌరవం ఉందని అన్నాడు.
"నా ట్వీట్ల వెనుకున్న కారణం వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించినవి కాదు. నేను యువీ ట్వీట్ చూసినప్పుడు ఆశ్చర్యపోలేదు. అందులో మాకేదో చెబుతున్నాడని కూడా అనిపించలేదు. అది సాధారణ ట్వీట్‌లాగే కనిపించింది. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఆ ట్వీట్‌లో నాకు తప్పేమీ కనపడలేదు."
- రవిచంద్రన్ అశ్విన్, టీమ్ఇండియా స్పిన్నర్
ఇక ఈ మ్యాచ్‌లో మొత్తం 30 వికెట్లు పడగా అందులో 28 స్పిన్నర్లకే దక్కడం గమనార్హం. దీంతో ఈ పిచ్ తయారీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పిచ్ టెస్టులకు పనికిరాదని, ఇలా చేయడం సరికాదని పలువురు మాజీ ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ విజయంతో టీమ్‌ఇండియా సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. చివరి టెస్టులోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో అడుగుపెట్టి న్యూజిలాండ్‌నూ ఓడించాలని పట్టుదలతో భారత్ కనిపిస్తోంది. మరి కోహ్లీసేన తర్వాతి మ్యాచ్‌ను గెలుస్తుందా లేదా ఇంగ్లాండ్ గట్టి పోటీ ఇస్తుందా వేచిచూడాలి.
ఇదీ చూడండి: ప్రపంచకప్‌లో సత్తాచాటిన సోదరులు వీరే!