కొత్తగా నిర్మించిన మొతేరా స్టేడియంలోని పిచ్ మీద పచ్చిక ఎక్కువగా ఉందని.. మ్యాచ్ ప్రారంభమయ్యేసరికి ఆ పరిస్థితి ఉండదని ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ పేర్కొన్నాడు. అంతవరకు వేచి చూడాలని చెప్పాడు. బుధవారం నుంచి పింక్‌బాల్ టెస్టు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సోమవారం అతడు మీడియాతో మాట్లాడాడు. పేస్ బౌలర్లుగా తాము ఎలాంటి పరిస్థితుల్లోనైనా అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పాడు. బంతి స్వింగైనా, అవ్వకపోయినా తాము చేయాల్సిన పని చాలా ఉందన్నాడు.
భారత్‌లో ఇది రెండో పింక్‌బాల్ టెస్టు అని.. ఇటీవలి కాలంలో మొదటిదని అండర్సన్ గుర్తుచేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో బంతి ఎలా స్పందిస్తుందో తమకు తెలియదని చెప్పాడు. అయితే, నెట్ సెషన్స్‌లో మాత్రం బంతి బాగా స్వింగైనట్లు ఇంగ్లాండ్ పేసర్ పేర్కొన్నాడు. అలాగే ఇంగ్లాండ్ టీమ్ పాటించే ఆటగాళ్ల రొటేషన్ పద్ధతిని విశాల దృక్పథంతో చూడాలని విమర్శకులకు సూచించాడు. రాబోయే రోజుల్లో తమ జట్టు చాలా టెస్టులు ఆడాల్సి ఉందని, దాంతో ఆటగాళ్లకు సరైన విశ్రాంతి అవసరమని చెప్పాడు. తాను రెండో టెస్టు ఆడకపోవడం వల్లే డే/నైట్ మ్యాచ్‌కు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నానని చెప్పాడు. ఇప్పుడు మరింత ఉత్సాహంగా ఉన్నానన్నాడు. తన ఒక్కడికే కాకుండా బౌలర్లందరికీ తగిన విశ్రాంతి అవసరమని చెప్పాడు.
ఇదీ చూడండి: మ్యాక్స్‌వెల్ కోసం ఆర్సీబీ మాక్ వేలం