టెస్టుల్లో తొలి రోజు బ్యాటింగ్ ఆరంభించిన జట్టు 500కు పైగా స్కోరు చేసిందంటే రెండో రోజు ఆట చివర్లో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానిస్తుంది. చివర్లో చకచకా ఒకట్రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని ఒత్తిడిలో నెట్టాలనుకుంటుంది. కానీ ఇంగ్లాండ్ అలా చేయలేదు. 2016లో చెన్నై టెస్టు మిగిల్చిన చేదు అనుభవం వారిని భయపెట్టి ఉండొచ్చు. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగులు చేసి కూడా ఇంగ్లాండ్ ఓడిపోయింది. కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ (303), రాహుల్ భారీ శతకం (199) తోడవడంతో ఆ మ్యాచ్‌లో భారత్ 759/7 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తర్వాత ఇంగ్లిష్ జట్టును 207 పరుగులకే ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ విజయం సాధించింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రస్తుతం రూట్ సేన ఆలౌటయ్యే వరకు ఆడాలని నిర్ణయించుకున్నట్లుంది. మళ్లీ బ్యాటింగ్‌కు రావాల్సిన అవసరం కూడా ఉండొద్దని ఆ జట్టు భావిస్తుండొచ్చు.
ఇక రెండే దారులు..!
చెన్నై టెస్టులో రెండు రోజులు గడిచిపోయాయి. ఇక ఈ మ్యాచ్‌లో రెండే ఫలితాలకు అవకాశముంది. ఒకటి ఇంగ్లాండ్ విజయం, రెండోది డ్రా. రెండు రోజుల తర్వాత కూడా ఇంగ్లిష్ జట్టు ఆలౌట్ కానపుడు ఇక భారత్ గెలుపు గురించి ఆలోచించడానికి అవకాశమేదీ? వరుసగా రెండో రోజూ ఆధిపత్యాన్ని కొనసాగించిన ఇంగ్లిష్ జట్టు తిరుగులేని స్థితికి చేరుకుంది. ఇంకేముంది ఆట ఆఖరుకు ఇంగ్లాండ్ స్కోరు 555/8. ఇక భారత జట్టు రెండు రోజులు ఆడి ప్రత్యర్థి స్కోరును అందుకుంటే.. డ్రా మీద ఆశలు పెట్టుకోవచ్చు. లేదంటే చెపాక్‌లో చేదు అనుభవం తప్పదు.
ఇదీ చదవండి: ఫిబ్రవరి 20 నుంచి విజయ్ హజారే ట్రోఫీ