Moeen Ali Test Retirement : లండన్ వేదికగా జరిగిన యాషెస్ వేదికగా ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ టెస్టు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2021లోనే అతను ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ అతన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో పాటు టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ మెక్‌కల్లమ్ కలిసి నచ్చజెప్పడం వల్ల అప్పుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అయితే ఈ సారి మాత్రం తాను కచ్చితంగా వెళ్తున్నట్లు పేర్కొన్నాడు.
2023 యాషెస్ టెస్ట్ జట్టులో కీలక పాత్ర పోషించిన అలీ.. ఈ సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 180 పరుగులతో పాటు 9 వికెట్లు సాధించాడు. చేతి గాయంతో బాధపడుతున్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మైదానంలో ఆడి తన సత్తాను చాటాడు. ఇక సోమవారం జరిగిన ఆఖరి టెస్ట్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అలాగే రిటైర్మెంట్ ప్రకటించాడు.
Ashes 2023 Moeen Ali : 2021 సెప్టెంబర్‌లో మొయిన్ అలీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే 2023 యాషెస్ నేపథ్యంలో జట్టు ఎంపిక చేస్తున్న సమయంలో ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్ లీచ్ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల యాషెస్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో మొయిన్ అలీని ఎంచుకోవాలని బోర్డు నిర్ణయించుకుంది. అయితే అప్పటికే టెస్టులకు అలీ రీటైర్మెంట్ ప్రకటించాడు. అయినప్పటికీ.. యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ మేనేజ్‌మెంట్ మొయిన్‌ను వెనక్కి రప్పించింది. 'యాషెస్ ఆడతావా?' అంటూ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మెసేజ్ చేయగా.. అలీ ఆ మెసేజ్‌కు ఓకే చెప్పాడు. అలా ఈ ఏడాది యాషెస్ సిరీస్‌కు మొయిన్ అలీని ఇంగ్లాండ్ సెలక్టర్లు ఎంపిక చేసుకున్నారు. అలా జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటాడు. అయితే మంగళవారం జరిగిన యాషెస్ చివరి టెస్ట్ తర్వాత మరోసారి తన రిటైర్మెంట్ ప్రకటించి అందరిని షాక్‌కు గురి చేశాడు.
'ఆ మెసేజ్ డిలీట్ చేస్తా'..
Moeen Ali Ashes Test : మ్యాచ్ తర్వాత మైదానంలో యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయాన్ని ప్రకటించాడు."రిటైర్మెంట్ గురించి స్టోక్స్ నాకు మళ్లీ మెసేజ్ చేస్తే, నేను దాన్ని వెంటనే డిలీట్ చేస్తాను. నేను వచ్చిన పని పూర్తి చేశాను. ఈ సిరీస్‌ను బాగా ఎంజాయ్ చేశాను. చివరి మ్యాచ్‌ను గెలుపుతో ముగించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. స్టోక్స్ నన్ను రీ ఎంట్రీ ఇవ్వమంటూ అడిగినప్పుడు మొదట్లో నేను నో చెప్పాను. ఎందకంటే నేను ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై ఎప్పుడూ బాగా ఆడలేదు. అందుకే నేను మళ్లీ ఆడనని చెప్పేశాను. కానీ స్టోక్స్ మాత్రం నాకు సపోర్ట్‌గా నిలిచి, నువ్వు అద్భుతంగా రాణించగలవంటూ చెప్పాడు. నిన్ను నేను ఇప్పటికీ నమ్ముతున్నాను అని అన్నాడు. దీంతో మళ్లీ రెడ్ బాల్ క్రికెట్‌లో ఆడేందుకు ఓకే చెప్పాను. అలా బ్రాడ్, జిమ్మీతో కలిసి మరోసారి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లాండ్ లాంటి జట్టుకు జాతీయ స్ధాయిలో ప్రాతినిథ్యం వహించినందుకు గర్వంగా ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.