ENG vs AUS Ashes 2021: క్రికెట్ చరిత్రలోనే ఎంతో ప్రాముఖ్యం పొందింది యాషెస్. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరిగే ఈ సిరీస్‌లో విజేతగా నిలవడం కోసం ఇరుజట్లు తీవ్రంగా శ్రమిస్తాయి. ఈ ఏడాది ఈ సిరీస్ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో మాట్లాడిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్.. ఆసీస్‌తో యాషెస్ సిరీస్‌లో ఎలా ఆడాలో తమకు స్పష్టత ఉందని అన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో గబ్బా (బ్రిస్బేన్)లో ఆసీస్‌పై భారత జట్టు సాధించిన విజయం నుంచి ప్రేరణ పొందుతామని తెలిపాడు. బ్రిస్బేన్‌లో ఆసీస్ ఓడటం గత 35 ఏళ్లలో అదే తొలిసారి. బుధవారం గబ్బా వేదికగానే ఆసీస్, ఇంగ్లాండ్‌ల మధ్య తొలి టెస్టు ప్రారంభంకానుంది.
Joe Root on Gabba: "ఆ సిరీస్ ఆసాంతం భారత జట్టు అద్భుతంగా ఆడింది. ఇక్కడకు వచ్చే పర్యటక జట్లకు మంచి ఉదాహరణగా నిలిచింది" అని రూట్ చెప్పాడు.
గబ్బా టెస్టు చారిత్రాత్మకం
IND vs AUS Gabba Test: ఈ ఏడాది జనవరిలో గబ్బా వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ భారీ స్కోరు చేసింది. లబుషేన్(108) సెంచరీకి తోడు టిమ్ పైన్(50), గ్రీన్(47) రాణించడం వల్ల ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌటైంది. శార్దుల్ ఠాకూర్(67), వాషింగ్టన్ సుందర్(62) అర్ధసెంచరీలతో రాణించారు. రోహిత్ శర్మ 44 పరుగులు చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో కంగారూ జట్టు 294 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని టీమ్ఇండియా ముందు 328 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లో స్టీవ్ స్మిత్ (55), వార్నర్ (48) టాప్ స్కోరర్లు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 328 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ గిల్ (91) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు పుజారా (56) అర్ధశతకంతో రాణించాడు. చివర్లో పంత్ (89) తనదైన శైలి దూకుడు బ్యాటింగ్‌తో భారత్‌కు మరపురాని విజయాన్ని అందించాడు.