టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడి సెమీ ఫైనల్ నుంచే భారత్ వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ వైపు మొగ్గు చూపుతారనే అంశం చర్చనీయాంశమవుతోంది. ఈ టోర్నీలో తన బ్యాటింగ్‌తో అదరగొట్టిన విరాట్ కోహ్లీ సైతం 2024 ప్రపంచకప్‌నకు దూరమవుతాడని పలువురు అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీని మినహాయిస్తే జట్టులో ఓ ముగ్గురి స్థానాలు గల్లంతయ్యే అవకాశం ఉందన్నాడు.
"ప్రపంచకప్ పోరులో టీమ్‌ఇండియా తీవ్రంగా నిరాశపరిచిందన్నది వాస్తవం. ఆశించి స్థాయిలో భారత జట్టు పోటీనివ్వలేకపోయింది. ఇంగ్లాండ్‌తో ఆట ఏకపక్షంగా సాగింది. జోస్ బట్లర్, హేల్స్ వంటి ఆటగాళ్లముందు రోహిత్ సేన బౌలింగ్ తేలిపోయింది. 168 స్కోర్ తక్కువేమీ కాదు. కానీ ఆడేది సెమీస్ అయినప్పుడు గట్టిపోటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈసారి రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్, అశ్విన్ టీ20లకు వీడ్కోలు చెప్పే అవకాశముంది. కచ్చితంగా టీమ్ మేనేజ్‌మెంట్ వీరిని పిలిచి భవిష్యత్తు ప్రణాళికల గురించి అడుగుతుంది. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికి వీరికి ఇదే మంచి సమయం. విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అందరికన్నా గొప్ప ఫిట్‌నెస్ కలిగి ఉన్నాడు. వయసు అతడికి ఒక నెంబర్ మాత్రమే. 2024 ప్రపంచకప్‌లో మీరు విరాట్‌ను చూస్తారు. రోహిత్, అశ్విన్, డీకేలకు ఆ అవకాశం ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను. వీరంతా టీ20లకు వీడ్కోలు పలికి టెస్టులు, వన్డేలపై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి" అని మాంటీ పేర్కొన్నాడు.