ప్రశాంతతకు మారుపేరుగా కనిపించే భారత బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్.. మాజీ క్రికెటర్ సురేశ్ రైనాపై కోప్పడ్డాడు. ఈ విషయాన్ని రైనానే స్వయంగా వెల్లడించాడు. ఇటీవల విడుదల చేసిన రైనా ఆత్మకథ.. 'బిలీవ్: వాట్ లైఫ్ అండ్ క్రికెట్ థాట్ మీ' అనే పుస్తకంలో తన కెరీర్ ప్రారంభంలో జరిగిన కొన్ని డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్లను బయటపెట్టాడు.
ఆ సంఘటన 2006లో ట్రై సిరీస్ నిమిత్తం భారత్ మలేసియాలో పర్యటిస్తున్న సమయంలో జరిగింది. అప్పుడు టీమ్ఇండియా కెప్టెన్‌గా ద్రవిడ్ వ్యవహరిస్తున్నాడు. అప్పుడప్పుడే జట్టులోకి వచ్చిన రైనా.. 'FCUK' అని రాసి ఉన్న టీ షర్ట్‌ను ధరించాడు. ఇది చూసిన ద్రవిడ్.. "మీరెలాంటి టీ షర్ట్‌ను వేసుకున్నారో తెలుసా? మీరు టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది వేసుకుని జనాల్లోకి ఎలా వెళ్తారు" అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే రైనా తన టీ షర్ట్‌ను తీసి పక్కకు వేశానని.. ఆ పుస్తకంలో పేర్కొన్నాడు.
రైనా 2005లో తన అరంగేట్రం శ్రీలంకపై చేశాడు. 18 టెస్టులతో పాటు 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. గతేడాది ఆగస్టు 15న ధోనీతో పాటు రైనా కూడా క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇదీ చదవండి: ఇల్లు గడవడానికి క్యాబ్ డ్రైవర్‌గా మారిన క్రికెటర్