Dhawan vs Ruturaj: విజయ్ హజారే ట్రోఫీ 2021లో టీమ్ఇండియా ఆటగాడు శిఖర్ ధావన్ ఫామ్‌లో లేక సతమతమవుతున్నాడు. అయితే.. యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, వెంకటేష్ అయ్యర్ అతడికి గట్టి పోటీఇస్తున్నారు. మంచి ఫామ్ కనబరుస్తూ సెంచరీలతో అదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వీరు ఎంపికయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఇటీవలే వన్డే జట్టుకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. వన్డే జట్టుకు స్క్వాడ్‌ను మాత్రం ఇంకా ఎంపికచేయలేదు.
వెంకటేష్ అయ్యర్ పక్కా..
విజయ్ హజారే ట్రోఫీలో వెంకటేష్ అయ్యర్ మధ్యప్రదేశ్ తరఫున అదరగొడుతున్నాడు. ఇప్పటికే రెండు సెంచరీలు చేశాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిలో కూడా పడ్డాడు. అయితే.. టీమ్ఇండియా జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఇతడికి కచ్చితంగా చోటు ఉంటుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సరైన ఫామ్‌లో లేని కారణంగా టీమ్ఇండియా ప్రస్తుతం మెరుగైన ఆల్‌రౌండర్ కోసం వెతుకుతోంది. ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని వెంకటేష్ అయ్యర్ భర్తీ చేయనున్నాడని చాలా మంది క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ధావన్ X రుతురాజ్..
మహారాష్ట్ర జట్టు సారథి రుతురాజ్ గైక్వాడ్ గత ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా మూడు సెంచరీలు చేసి సెలెక్టర్ల దృష్టి ఆకట్టుకున్నాడు. అయితే.. శిఖర్ ధావన్ మాత్రం సరైన ఫామ్‌లో లేడు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు టోర్నీల దృష్ట్యా రుతురాజ్‌కు అవకాశం ఇవ్వొచ్చని క్రికెట్ నిపుణులు అంటున్నారు.
మరోవైపు అజింక్య రహానే, ఇషాంత్ శర్మలకు అవకాశం ఇచ్చినట్లు శిఖర్‌కు కూడా ఓ ఛాన్స్ ఇవ్వొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: