Deepak Chahar Injury: ఫాస్ట్‌బౌలర్ దీపక్ చాహర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి మరో నాలుగైదు వారాలు పట్టే అవకాశముంది. వెస్టిండీస్‌తో సిరీస్ సందర్భంగా గాయపడ్డ చాహర్.. టీ20 లీగ్‌లో ఆడలేకపోయాడు. ప్రస్తుతం అతడు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఉన్నాడు. "ఏకబిగిన అయిదు ఓవర్లు బౌలింగ్ చేయగలుగుతున్నా. గాయం నుంచి కోలుకుంటున్నా. అంతా ప్రణాళిక ప్రకారమే జరగుతోంది. నేను పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరో 4-5 వారాలు పట్టే అవకాశముంది" అని చాహర్ చెప్పాడు. జులైలో భారత జట్టు ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడే సమయానికి తాను కోలుకోవడం సాధ్యం కాదని అతడు అన్నాడు.
"గాయం నుంచి కోలుకునే ప్రక్రియ దశల వారిగా సాగుతోంది. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ సమయానికి నేను ఫిట్‌నెస్ సాధిస్తానని భావించట్లేదు. నా ఫిట్‌నెస్‌ను పరీక్షించుకోవడానికి నేను ముందు క్లబ్ స్థాయి క్రికెట్ ఆడాల్సిన అవసరముంది’’ అని చాహర్ చెప్పాడు. వెస్టిండీస్‌తో సిరీస్ సమయానికైనా అందుబాటులో ఉంటారా అన్న ప్రశ్నకు.. "అది కూడా చెప్పలేను. అయితే కచ్చితంగా ఆ సిరీస్ వరకు ఫిట్‌నెస్ సాధించడానికి ప్రయత్నిస్తా. చూద్దాం ఏం జరుగుతుందో" అని బదులిచ్చాడు. భారత జట్టు జులై 22 నుంచి ఆగస్టు 7 వరకు వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, అయిదు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది.
లాంక్‌షైర్‌కు ఆడనున్న సుందర్: చేతి గాయం నుంచి కోలుకున్న స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కౌంటీల్లో ఆడటానికి సిద్ధమవుతున్నాడు. కౌంటీల్లో అతడు లాంక్‌షర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. "వాషింగ్టన్ సుందర్ పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌కు దగ్గర్లో ఉన్నాడు. అతడికి చాలా మ్యాచ్ ప్రాక్టీస్ కావాలి. సుందర్ లాంక్‌షైర్ తరఫున ఆడబోతున్నాడు" అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. సుందర్ టీ20 లీగ్‌లో హైదరాబాద్‌కు ఆడుతూ గాయపడ్డాడు. దీంతో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు అతణ్ని తీసుకోలేదు. ఐర్లాండ్ పర్యటనకు కూడా సెలక్టర్లు అతణ్ని ఎంపిక చేయలేదు.
ఇదీ చూడండి: 'భారత్ ఏం చెబితే అదే.. ప్రపంచ క్రికెట్‌ను అలా శాసిస్తోంది'