Deep Das Gupta about Ishant: టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీకి సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మపై ఇప్పుడు నమ్మకం ఉందో లేదో చెప్పలేనని మాజీ వికెట్ కీపర్ దీప్‌దాస్ గుప్తా అన్నాడు. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ గాయపడటం వల్ల మూడో టెస్టులో ఆడే అవకాశాలు లేనట్లు కనిపిస్తున్నాయి. దీంతో ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అవకాశాలు దక్కని సీనియర్ పేసర్లు ఇషాంత్, ఉమేశ్ యాదవ్‌లలో ఒకర్ని చివరి టెస్టుకు ఎంపిక చేసే వీలుంది. ఈ నేపథ్యంలోనే దీప్‌దాస్ తాజాగా పీటీఐతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
"2019 వరకూ ఇషాంత్ నైపుణ్యాలపై కోహ్లీకి ఉన్న నమ్మకం ఇప్పుడు ఉందో లేదో నేను చెప్పలేను. ఒకవేళ మూడో టెస్టులో ఇషాంత్‌కు చోటు దక్కితే.. ఉమేశ్ కన్నా టీమ్‌ఇండియాకు బాగా ఉపయోగపడతాడు. అందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి అతడి ఎత్తు. హైట్ ఎక్కువగా ఉండటం వల్ల కష్టతరమైన విధంగా బంతులేస్తాడు. రెండోది అతడు ప్రత్యర్థి బ్యాటర్లను పరుగులు చేయకుండా ఎక్కువ సేపు కట్టడి చేస్తాడు. అలాగే అతడు ఒక స్పెల్‌లో 8 నుంచి 10 ఓవర్ల పాటు బౌలింగ్ చేయగలడు. దీంతో పరిస్థితులను బట్టి టీమ్‌ఇండియా యాజమాన్యం తుది జట్టులో ఎవరు ఉండాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటుంది."
-దీప్‌దాస్, మాజీ వికెట్ కీపర్
ఇషాంత్ చివరిసారి దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆడాడు. ఆ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయకపోవడం వల్ల జట్టు యాజమాన్యం పక్కనపెట్టింది. అనంతరం ఈ పర్యటనలోనూ ఇప్పటివరకు ఆడిన రెండు టెస్టుల్లో అవకాశం ఇవ్వలేదు. మరి మూడో టెస్టులోనైనా జట్టు అతడిని తీసుకుంటుందా లేక ఉమేశ్‌ను ఎంపిక చేస్తుందా చూడాలి.