సౌథాంప్టన్ వేదికగా కివీస్‌తో జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమ్ఇండియా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతోంది. మూడో రోజు లంచ్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఇషాంత్ శర్మ(6 బంతుల్లో 2 పరుగులు), రవీంద్ర జడేజా(46 బంతుల్లో 15 పరుగులు) క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్లలో జేమీసన్ 3, వాగ్నర్ 2, బౌల్ట్, సౌథీ తలో వికెట్ తీసుకున్నారు.
146/3తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమ్ఇండియా.. కాసేపటికే కెప్టెన్ కోహ్లీ వికెట్‌ను కోల్పోయింది. అద్భుతమైన బంతితో జేమీసన్.. విరాట్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. 22 బంతులాడి కేవలం 4 పరుగులే చేసిన పంత్ అనవసరమైన షాట్ ఆడి జేమీసన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. మరో బ్యాట్స్‌మన్ అజింక్య రహానె.. సంయమనం ప్రదర్శించాడు. అర్ధ సెంచరీకి చేరువైన అతడిని వాగ్నర్ బోల్తా కొట్టించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అశ్విన్(27 బంతుల్లో 22 పరుగులు) ధాటిగా ఆడే ప్రయత్నం చేసి చివరికి స్లిప్స్‌లో దొరికిపోయాడు.
రాణించిన కివీస్ బౌలర్లు..
ఆట ప్రారంభమైన రెండో రోజు టీమ్ఇండియా 64.4 ఓవర్ల పాటు ఆడి కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఓపెనర్లతో పాటు పుజారా వికెట్‌ను వెంటవెంటనే కోల్పోయిన భారత్‌ను కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానె ఆదుకునే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ, మూడో రోజు తొలి సెషన్లో కోహ్లీ సేన డీలాపడింది. జట్టు మంచి స్థితిలోకి వచ్చిందనుకున్న సమయంలోనే విరాట్ వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రమక్రమంగా వికెట్లను పారేసుకుంది టీమ్ఇండియా.
ఇంకా రెండు సెషన్ల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో టీమ్ఇండియా ఎంతసేపు క్రీజులో నిలుస్తుందనేది చూడాలి. అయితే ఈ వికెట్లన్నీ కివీస్ బౌలర్లకు సునాయాసంగా దక్కినవేమి కాదు. ఒక్క పంత్ మాత్రమే నిర్లక్ష్యంగా షాట్‌కు పోయి స్లిప్స్‌లో చిక్కాడు. మిగతా భారత బ్యాట్స్‌మెన్ అందరినీ.. న్యూజిలాండ్ బౌలర్ల చాకచక్యంతో బుట్టలో వేసుకున్నారు. ముఖ్యంగా ప్రమాదకరంగా కనపడుతున్న రహానేను ఔట్ చేయడానికి పక్కా స్కెచ్ వేశారు.
ఆట ఆలస్యం..
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు మొదటి నుంచి వరుణుడు అడ్డు తగులుతూనే ఉన్నాడు. ఈ కారణంగానే మూడో రోజు ఆట కూడా ఆలస్యమైంది. సౌథాంప్టన్‌లో వర్షం కురిసింది. ఈ కారణంగా ఔట్‌ఫీల్డ్ తడిగా మారింది. దీంతో మ్యాచ్ సమయానికి ప్రారంభం కాలేదు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30కి మ్యాచ్ ప్రారంభమైంది. ఇప్పటికే తొలి రోజు ఆట వర్షం వల్ల తుడిచిపెట్టుకుపోయింది. ఇక రెండో రోజు ఆట కూడా వెలుతురులేమీ కారణంగా నిర్ణీత సమయం కంటే ముందుగానే ముగిసింది.
ఇదీ చదవండి: Controversial Tweet: ట్వీట్ చేశారు.. చిక్కుల్లో పడ్డారు