David Warner Australia Coach : ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ గురించి ఆ జట్టు మాజీ కోచ్ జాన్ బుకానన్ సంచలన వ్యాఖ్యాలు చేశాడు. అతడేం గొప్ప క్రికెటర్ కాదంటూ, 'గ్రేట్' అనేంత రేంజ్లో వార్నర్ చేసిందేమీ లేదంటూ బుకాకన్ కామెంట్ చేశాడు. , గ్లెన్ మెక్‌గ్రాత్, డాన్ బ్రాడ్‌మన్ షేన్ వార్న్ లాంటి ప్లేయర్లతో పోలిస్తే వార్నర్ సాధించిందేముందంటూ ప్రశ్నించాడు.
" ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్‌లో వార్నర్ అద్భుతంగా ఆడాడు. టెస్టులలో అతడి ఖాతాలో 8 వేలకు పైగా పరుగులున్నాయి. వంద టెస్టులు, 160 వన్డేలు, వందకు పైగా టీ20లు ఆడి సత్తా చాటాడు. అతడి యావరేజ్‌తో పాటు స్ట్రైక్ రేట్ కూడా బాగుంది. పర్ఫామెన్స్ పరంగా చూస్తే వార్నర్ ఇతర క్రికెటర్ల కంటే మెరుగ్గా ఆడాడు. కానీ, క్రికెట్‌లో 'గ్రేట్' అనిపించుకునేంత గొప్పగా వార్నర్ ఏమీ చేయలేదని నా ఫీలింగ్. గ్రేట్ అనిపించుకోవాలంటే క్రికెట్‌లో మరెవరూ అతడు సాధించిన రికార్డుల దరిదాపుల్లోకి రాకూడదు. ఆ లిస్ట్‌లో చూసుకుంటే ఆసీస్ నుంచి గ్లెన్ మెక్‌గ్రాత్, డాన్ బ్రాడ్‌మన్, షేన్ వార్న్‌లు మాత్రమే గ్రేట్ అని నా అభిప్రాయం. కచ్చితంగా వార్నర్ అయితే ఆ కేటగిరీలో లేడు." అంటూ వార్నర్‌ను ఉద్దేశించి కామెంట్ చేశాడు.
David Warner Future Plans : ఇక ఇటీవలే ఇంటర్నేషనల్ వన్డే, టెస్టు ఫార్మట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్ ప్రస్తుతం టీ20ల్లో కొనసాగనున్నాడు. అయితే పొట్టి ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు పలికిన తర్వాత క్రికెట్ నుంచి దూరం అవ్వాలని లేదట. అందుకే భవిష్యత్‌లో అవకాశం వస్తే కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆసక్తి చూపిస్తానంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మనులోని మాట చెప్పుకొచ్చాడు. 'నేను కోచ్‌గా సమర్థంగా రాణించగలను. నా ఫ్యూచర్ గోల్ కూడా అదే. ఈ విషయం గురించి నా భార్యకు కూడా చెప్పాను. కోచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తే ఏడాదిలో కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి వస్తుందని చెప్పా' అని వార్నర్ అన్నాడు.
రెండు ఛాప్టర్లు ముగిశాయి : కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడేసిన వార్నర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. 'నా కెరీర్‌లో రెండు ఛాప్టర్లు (వన్డే, టెస్టు) ముగిశాయి. ఇంకో అధ్యాయం (టీ20 ఫార్మాట్) మిగిలి ఉంది. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎవరికీ ఇబ్బంది కలిగించలేదని అనుకుంటున్నా. ఇప్పటివరకు నా కెరీర్‌లో నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు' అని వార్నర్ తెలిపాడు.
14ఏళ్ల టెస్టు కెరీర్- అంచనాలకు మించి ఇన్నింగ్స్- బెస్ట్ 5 ఇవే!
ఓపెనింగ్ రేస్‌లో స్టార్ ప్లేయర్లు- వార్నర్ రిప్లేస్మెంట్ వీళ్లే!