నలుగురు భారత క్రికెటర్లను అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది బీసీసీఐ. ఈ జాబితాలో షమీ, బుమ్రా, రవీంద్ర జడేజాతో పాటు భారత మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్ పేరు కూడా ఉంది. వీరిలో జడేజా మినహా మిగతా ముగ్గురు బౌలర్లే కావడం విశేషం. షమీ, బుమ్రా, జడేజా ప్రపంచకప్ జట్టులోనూ చోటు దక్కించుకున్నారు.
49 వన్డేలాడిన బుమ్రా 85 వికెట్లు తీశాడు. 10 టెస్టుల్లో 49 వికెట్లు తన ఖాతాలో వేసుకుని ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఆల్‌రౌండర్ జడేజా 151 వన్డేల్లో 2,035 పరుగులతో పాటు 174 వికెట్లు తీశాడు. 41 టెస్టుల్లో 192 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో చెన్నై తరఫున ఆడుతున్నాడు.
మహ్మద్ షమీ 63 వన్డేల్లో 113 వికెట్లతో దూసుకెళ్తున్నాడు. 40 టెస్టుల్లో 144 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
భారత మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్ పేరును అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది బీసీసీఐ. 23 వన్డేలాడిన ఈ లెగ్‌స్పిన్నర్ 33 వికెట్లు తీసింది.