ప్రపంచకప్ టైటిల్ గెలుపునకు కేవలం రెండు అడుగుల దూరంలో నిలిచింది భారత జట్టు. సెమీస్‌లో మంగళవారం మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్‌తో తలపడబోతోంది. ప్రపంచకప్ ప్రారంభంలో వరుస విజయాలతో ఊపు మీద కనిపించిన కివీస్.. చివర్లో హ్యాట్రిక్ ఓటములతో నిరాశలో కూరుకుపోయింది. అయినా ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కోహ్లీసేన సరైన ప్రణాళికతో విలియమ్సన్ సేనకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది.
ఆరుగులు బౌలర్లు
న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీసేన ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగాలని క్రికెట్ పండితులు సూచిస్తున్నారు. బుమ్రా, భువనేశ్వర్‌తో పాటు షమీ జట్టులో ఉంటే బౌలింగ్ విభాగంలో పటిష్ఠంగా నిలవొచ్చు. డెత్ ఓవర్లలో షమీ అంత ప్రభావం చూపించలేకపోతున్నాడు. అందువల్ల అతడిని ప్రారంభంలో కొన్ని ఓవర్లు వేయించి మిడిల్ ఓవర్లలోనూ బంతిచ్చి కివీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయించాలి. పాండ్య నాలుగో పేసర్‌గా ఉండనే ఉన్నాడు. కుల్దీప్, చాహల్లో ఒక మణికట్టు స్పిన్నర్‌తో పాటు జడేజాతో స్పిన్ కోటాను పూర్తి చేయిస్తే మంచిది.
జట్టులో జడేజా ఉండాలి
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో జడేజా బంతితో రాణించాడు. ప్రపంచకప్‌లో మొదటి మ్యాచ్ ఆడి తన విలువేంటో నిరూపించాడు. బౌలింగ్ కోటాను వేగంగా.. పరుగులను నియంత్రిస్తూ పూర్తి చేయగలడు. అలాగే జడేజా అద్భుత ఫీల్డర్. ఏడో స్థానంలో నమ్మదగ్గ బ్యాట్స్‌మెన్ కూడా.
ఓపెనర్లు అటాకింగ్ మోడ్‌లో...
ధావన్ గాయంతో ప్రపంచకప్ నుంచి వైదొలగగా రోహిత్‌తో కలిసి రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నాడు. వీరిద్దరూ మొదటి పవర్ ప్లేలో కాస్త నెమ్మదిగా ఆడుతున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి పది ఓవర్లలో 28 పరుగులు మాత్రమే సాధించారు. ఆ తర్వాత బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్‌ల్లో కాస్త దూకుడు పెరిగింది. రోహిత్ వరుస సెంచరీలతో జోరు మీద ఉండగా.. రాహుల్ లంకపై శతకం పూర్తి చేశాడు. ఇదే ఊపుతో సెమీస్‌లో కివీస్ బౌలర్లపై మొదటి పవర్ ప్లే ఆధిపత్యం చెలాయిస్తే టీమిండియాకు తిరుగుండదు. ముఖ్యంగా ఫామ్‌లో ఉన్న బౌల్ట్ కొత్త బంతితో ప్రమాదకరం.
విలియమ్స్న్ను కట్టడి చేయాలి
విలియమ్సన్‌ను కట్టడి చేయడానికి టీమిండియా వద్ద తగిన ప్రణాళికలు ఉండాలి. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్క్ కివీస్ సారథిని కట్టడి చేసిన విధంగా కోహ్లీ.. బుమ్రాతో తగిన వ్యూహాలు పన్నాలి. కివీస్ ఓపెనింగ్‌లో వరుసగా విఫలమవుతున్నారు. టాపార్డర్‌ను వీలైనంత తొందరగా పెవిలియన్ పంపడానికి టీమిండియా కృషి చేయాలి.
ఇవీ చూడండి.. WC19: గతం అనవసరం.. విరాట్‌తో రోహిత్