ఐసీసీ ప్రపంచకప్-2019 ఫైనల్లో కివీస్Xఇంగ్లాండ్ మధ్య ఉత్కంఠ పోరులో గప్తిల్ విసిరిన బంతి స్టోక్స్ బ్యాటుకు తగిలి బంతి బౌండరీ దాటింది. ఫలితంగా ఇంగ్లీష్ జట్టుకు నాలుగు పరుగులు లభించాయి. ఇదే ఆ జట్టును ఓటమి నుంచి రక్షించింది.
ఏమైంది....
ఇంగ్లాండ్ ఛేదనలో చివరి ఓవర్ నాలుగో బంతిని స్టోక్స్ కవర్‌వైపు ఆడాడు. బంతి అందుకున్న మార్టిన్ గప్తిల్ కీపర్ వైపు విసిరాడు. అంతలోనే రెండో పరుగు కోసం క్రీజులోకి డైవ్ చేసిన స్టోక్స్ బ్యాటుకు బంతి తగిలింది. నేరుగా ఆ బంతి బౌండరీ దాటింది. అనుకోకుండా ఇలా జరగడం వల్ల అంపైర్లు 4 ఎక్స్‌ట్రాలు కలిపి మొత్తం 6 పరుగులు ఇంగ్లాండ్ ఖాతాలో చేర్చారు. ఆ తర్వాత రెండు పరుగులు రావడం వల్ల మ్యాచ్ టై అయింది. కాగా ఓవర్‌త్రో రూపంలో వచ్చిన ఆ నాలుగు పరుగుల్ని స్కోరులోంచి తొలగించాలని స్టోక్స్ అంపైర్లను కోరినట్టు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో అండర్సన్ తెలిపాడు.
‘ఫీల్డర్ స్టంప్స్ వైపు విసిరిన బంతి బ్యాట్స్‌మన్‌కు తగిలి మైదానంలో ఖాళీల్లోకి వెళ్తే పరుగు తీయకపోవడం క్రికెట్‌లో పద్ధతి. అదే బంతి నేరుగా బౌండరీకి చేరితే నిబంధనల ప్రకారం నాలుగు పరుగులు వస్తాయి. బెన్‌స్టోక్స్ నిజానికి అంపైర్ల దగ్గరకు వెళ్లి ‘మీరు ఆ నాలుగు పరుగుల్ని తీసేస్తారా? అవి మాకొద్దు’ అని అడిగాడట. కానీ అంపైర్లు తమ నిర్ణయానికే కట్టుబడ్డారు.
బెన్‌స్టోక్స్ నిజంగా అలా అంపైర్లను అడిగి ఆ నాలుగు పరుగుల్ని తీసేయించి ఉంటే న్యూజిలాండ్ విశ్వవిజేతగా అవతరించేది. అయితే ఆ ఓవర్ త్రో విషయంలో తాను జీవితాంతం కివీస్ జట్టుకు క్షమాపణలు చెప్తానని మ్యాచ్ తర్వాత స్టోక్స్ కోరడం గమనార్హం.
ఇది చదవండి: అసోం వరద బాధితులకు అక్షయ్ భారీ సాయం