ఇంగ్లాండ్ పరిస్థితులకు అలవాటు పడితేనే స్థిరంగా రాణించగలమని టీమిండియా ఓపెనర్ కే ఎల్ రాహుల్ అన్నాడు. ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని, ఇంగ్లీష్ పిచ్‌ల్లో రోహిత్ లాంటి ఆటగాడే అలాంటి ప్రదర్శన చేస్తాడని అభిప్రాయపడ్డాడు.
"గత రెండేళ్ల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. వికెట్‌కు తగినట్టుగా, పిచ్ పరిస్థితులకు అలవాటు పడితేనే స్థిరంగా రాణించగలం. గత కొన్ని మ్యాచ్‌ల్లో పిచ్ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఉన్నట్టుండి వికెట్ స్లోగా మారుతోంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని పరుగులు చేయడానికి అలవాటు పడాలి" - కే ఎల్ రాహుల్, టీమిండియా ఓపెనర్
ఈ ప్రపంచకప్‌లో వరుసగా నాలుగు శతకాలతో ఆకట్టుకున్న రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడని కితాబిచ్చాడు రాహుల్. ఇంగ్లాండ్ పిచ్‌ల్లో అతడిలా(రోహిత్) ఆడాలంటే మళ్లీ హిట్ మ్యాన్ లాంటి బ్యాట్స్‌మెన్‌కే కుదురుతుందని అభిప్రాయపడ్డాడు.
మెగాటోర్నీ ప్రారంభంలో నాలుగో స్థానంలో ఆడిన రాహుల్.. ధావన్ గాయం కారణంగా తప్పుకోగా అతడి స్థానంలో ఓపెనర్‌గా వస్తున్నాడు. ఈ టోర్నీలో రెండు అర్ధశతకాలతో ఆకట్టుకున్నాడీ బ్యాట్స్‌మెన్. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రోహిత్‌తో కలిసి 180 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఇది చదవండి: 'రాయుడు... నువ్వు ఉన్నతమైన వ్యక్తివి'