వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఆశలు ఆవిరయ్యాయి. మిగతా జట్ల గెలుపోటములను బట్టి ఇప్పటివరకు సెమీస్ రేసులో నిలిచింది దాయాది దేశం. ముఖ్యంగా భారత్‌పై ఎక్కువ నమ్మకం పెట్టుకొని భంగపడింది. టోర్నీ ఆరంభం నుంచి 1992 ప్రపంచకప్ ఫలితాలను పోల్చుకొని సంబరపడిన పాక్ అభిమానులు నేటి మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఆ జట్టు నిష్క్రమణను కనులారా చూడనున్నారు. బంగ్లాపై కనీసం 311 పరుగుల భారీ తేడాతో గెలిస్తేనే ఆ జట్టు సెమీస్ రేసులో ఉంటుంది.
జూన్ 16న టీమిండియా చేతిలో ఓటమి పాక్‌ను పూర్తిగా ముంచేసింది. ఆ తర్వాత జరిగిన 3 మ్యాచ్‌ల్లో గెలిచినా పాక్ అవకాశాలు ఇంగ్లాండ్ గెలుపోటములపై ఆధారపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ రెండు వరుస ఓటముల నుంచి బయటపడి భారత్, న్యూజిలాండ్‌లను చిత్తుచేసింది. ఫలితంగా.. ఆతిథ్య జట్టు తొమ్మిది మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది.
ఇప్పటికే ఆసీస్, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. ఇంగ్లాండ్ మూడో స్థానంలో నిలిచింది. నాలుగో స్థానం ఇంకా ఖరారు కాలేదు. అయితే నెట్ రన్‌రేట్‌లో పాకిస్థాన్ (-0.792) కన్నా కివీస్ (+0.175) ముందంజలో ఉంది. అయినా పాకిస్థాన్ జట్టు సెమీస్ చేరాలంటే బంగ్లాతో మ్యాచ్‌లో మూడు అవకాశాలు ఉన్నాయి.
మూడే మార్గాలు..
శుక్రవారం పాకిస్థాన్ X బంగ్లాదేశ్ మ్యాచ్‌లో టాస్ కీలకం కానుంది. తొలుత బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే పాక్ సెమీస్ ఆశలు పూర్తిగా వదులుకోవాల్సిందే. లేదంటే మూడు మార్గాల్లో నాకౌట్ చేరే అవకాశాలున్నాయి.
- తొలుత బ్యాటింగ్ ఎంచుకొని 350 పరుగులు చేయాలి. అనంతరం బంగ్లాను 39 పరుగులకే కట్టడి చేయాలి.
- ఒకవేళ 400 పరుగులు సాధిస్తే.. బంగ్లాను 84 పరుగులకే ఆలౌట్ చేయాలి
- 450 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించి.. బంగ్లాను 129 పరుగుల వద్ద ఆపేయాలి.
ఈ మూడు మార్గాల్లో ఏదో ఒక విధంగా గెలిస్తే దాయాది దేశం న్యూజిలాండ్‌ను అధిగమించి సెమీస్ చేరే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్‌పై నెగ్గి పాక్ సెమీస్ చేరుతుందా అనే ప్రశ్నకు ఆ జట్టు సారథి సర్ఫ్రాజ్ అహ్మద్ అవాక్కయ్యే సమాధానమిచ్చాడు.
"మేం ఇక్కడికి అన్ని మ్యాచ్‌లు గెలవాలనే వచ్చాం. చివరి గేమ్‌లోనూ మంచి ఆటతీరు ప్రదర్శిస్తాం. 600, 500 లేదా 400 పరుగులు సాధించి.. అవతలి జట్టును 50 రన్స్‌కే పరిమితం చేస్తే.? మాకు అవకాశం ఉంటుంది. ఇది కష్టమైనా మా వంతు ప్రయత్నం చేస్తాం ".
-- సర్ఫ్రాజ్ అహ్మద్, పాక్ జట్టు సారథి
వన్డే క్రికెట్‌లో ఇంతటి ఘన విజయం సాధించడం చాలా కష్టం. దీంతో పాక్ సెమీస్‌కు వెళ్లడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.