భారత ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఎడమ చేతి బొటన వేలుకు గాయమైన నేపథ్యంలో కనీసం రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే ధావన్ స్థానంలో ఎవరు ఆడతారు? ఐసీసీ టోర్నీలో గబ్బర్ దూరం కావడం ఎలాంటి ప్రభావం చూపనుంది? లాంటి ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.
ధావన్ దూరమవడం ఎందుకు ఎదురుదెబ్బంటే..
ఐసీసీ టోర్నీల్లో శిఖర్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2015 వరల్డ్‌కప్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ ధావనే. ఆ టోర్నీలో 412 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు ఉన్నాయి.
2013, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ శిఖర్ ధావన్ ఎక్కువ పరుగులు చేశాడు. 2013లో 363 పరుగులు చేయగా.. 2017లో 368 పరుగులతో ఆకట్టుకున్నాడు.
ఐసీసీ టోర్నమెంట్లలో ధావన్ శతకాలు చేసిన ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో భారత్ విజయం సాధించడం ఆసక్తికర విషయం. గత 20 మ్యాచుల్లో 65.15 సగటుతో 1238 పరుగుల చేశాడు గబ్బర్. ఇందులో ఆరు శతకాలు, 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రపంచకప్‌లోనూ ఆసీస్‌పై జరిగిన మ్యాచ్‌లో 109 బంతుల్లో 117 పరుగులతో రాణించాడు.
ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరం కావడం భారత్‌కు నిజంగా ఎదురుదెబ్బే. ముఖ్యంగా కీలకమైన న్యూజిలాండ్, పాకిస్థాన్ మ్యాచ్‌లకు ధావన్ దూరం కానున్నాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌ల్లో ఫలితం టీమిండియాకు ప్రతికూలంగా ఉంటే సెమీస్ అవకాశాలు కష్టతరం కావచ్చు. అయితే ధావన్ రెండు వారాల్లో కోలుకుంటాడని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది.
తిరగబెట్టిన సమస్య..
మొన్నటివరకు టీమిండియాలో 4వ స్థానంలో ఎవరు ఆడతారనేది సమస్యగా ఉంది. కే ఎల్ రాహుల్ నాలుగోస్థానంలో నిలకడగా రాణిస్తుండగా.. ఆ సమస్య తీరిందనుకున్నారు. ఈలోపు రెండో స్థానంలో ఇబ్బంది తలెత్తింది. ఒకవేళ ధావన్ దూరమైతే... నాలుగో స్థానంలో ఆడుతున్న రాహుల్ ఓపెనర్‌గా రావాల్సి ఉంటుంది. ఫలితంగా మళ్లీ నాలుగోస్థానంపై సందిగ్ధం నెలకొంది.
ధావన్ స్థానంలో ఎవరు?
ఓపెనర్‌గా రాహుల్ ఆడే అవకాశముంది. రాహుల్ స్థానంలో విజయ్ శంకర్, దినేశ్ కార్తీక్‌లో ఒకరిని ఆడిస్తారా లేదా అనేది చూడాలి. 15వ మంది జట్టులో స్టాండ్‌బై ఆటగాళ్లైన రిషబ్ పంత్, అంబటి రాయుడకు చోటు దక్కే అవకాశముంది. ముంబయి బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్‌కూ చాన్స్ లేకపోలేదు. ఎందుకంటే నాలుగో స్థానం స్పెషలిస్టు బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యరే. నాలుగో స్థానంలో ఆడేందుకు వీరిలో ఎవరికైనా అవకాశం దక్కొచ్చు.
గురువారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ఎలాగూ ధావన్ అందుబాటులో ఉండడు. జూన్ 16న పాకిస్థాన్ మ్యాచ్‌కు అనుమానమే. జూన్ 22న అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లోపు కోలుకునే అవకాశముంది. అప్పటికీ శిఖర్ ఫిట్నెస్ సాధించకపోతే జూన్ 27న వెస్టిండీస్ మ్యాచ్ ఆడే అవకాశముంది.