పాక్ క్రికెటర్ బాబర్ అజాంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ పొగడ్తల వర్షం కురిపించాడు. అతడు పాకిస్థాన్ కోహ్లీ అంటూ కితాబిచ్చాడు. ప్రపంచకప్‌లో బాబర్ అజాం పాక్‌కు కీలకమౌతాడని తెలిపాడు. అతడి బ్యాటింగ్ శైలి విరాట్‌ను పోలి ఉంటుందని చెప్పాడు.
"బాబర్ అజాం మంచి క్లాసిక్ ప్లేయర్. పాక్ బ్యాటింగ్ లైనప్‌లో అతడు విరాట్ కోహ్లీ. వరల్డ్‌కప్‌లో పాక్ సత్తాచాటాలనుకుంటే బాబర్‌పైనే ఆధారపడాల్సి ఉంది" -మైఖేల్ క్లార్క్, ఆసీస్ మాజీ సారథి.
ఆఫ్గాన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో బాబర్ అజాం శతకంతో సత్తాచాటాడు. 108 బంతుల్లో 112 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. అయితే మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమైన కారణంగా పాక్ 262 పరుగులకే ఆలౌటైంది. లక్ష్యఛేదనలో ఆఫ్గాన్ బ్యాట్స్‌మెన్ షాహిది(74), హజ్రతుల్లా(49) రాణించి మ్యాచ్‌ను గెలిపించారు.
టీ 20ల్లో 26 ఇన్నింగ్స్‌ల్లోనే అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా బాబర్ అజాం రికార్డు సృష్టించాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ ఆకట్టుకున్నాడు.