కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించినప్పటి నంచి టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ ఇంటికే పరిమితమయ్యాడు. ముంబయిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నాడు. దేశంలో వైరస్ వ్యాప్తి అరికట్టే క్రమంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ ప్రచారాల్లోనూ పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే తన అభిరుచుల వైపూ అడుగులేస్తున్నాడు.
తెందూల్కర్‌కు వంట చేయడమంటే ఇష్టమని గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ముఖ్యంగా ముంబయి ఫేమస్ 'వడా పావ్' అంటే అమితమైన ప్రేమగా పేర్కొన్నాడు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో బయటికి వెళ్లి తినలేక.. ఇటీవలే తన ఇంట్లోనే వడా పావ్‌ను తయారు చేసుకున్నాడు. ఆ సమయంలో అనుకోని అతిథి ఒకరు తన ఇంటికి వచ్చినట్లు సచిన్ ఇన్‌స్టాలో తెలిపాడు. ఆ సందర్శకుడు ఎవరో కాదు ఓ పిల్లి.
మంగళవారం ఆ అతిథి, తన కొత్త స్నేహితుడు మళ్లీ తిరిగొచ్చిందని సచిన్ తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో పిల్లి సచిన్ చుట్టూ తిరుగుతూ కనిపించింది. ఈ క్రమంలోనే తన కొత్త స్నేహితుడు వడా పావ్‌ను మిస్ అయినట్లుందని పేర్కొన్నారు.
- View this post on Instagram
My new friend is back! Looks like he's missing the Vada Pav from the last visit. 😋
">
ఏటా ముంబయి ఇండియన్స్ జట్టుకు మద్దతుగా నిలబడేందుకు స్టేడియంలో కనిపించే సచిన్.. ఈ సారి కరోనా కారణంగా వెళ్లలేదు. యూఏఈ వేదికగా జరగనున్న లీగ్.. సెప్టెంబరు 19న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ముంబయి, చెన్నై జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి.