సౌతాంప్టన్ వేదికగా రోజ్ బౌల్ మైదానంలో అఫ్గాన్‌తో జరిగిన పోరులో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి.
బుమ్రాకు సిక్స్...
భారత స్టార్ బౌలర్ బుమ్రా ఖాతాలోని అరుదైన రికార్డును చెరిపేశాడు అఫ్గాన్ ఆల్‌రౌండర్ నబీ. ఈ ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన బుమ్రా... మొత్తం 168 బంతులేసి ఒక్క సిక్స్ కూడా ఇవ్వలేదు. కాని సౌతాంప్టన్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు చెదిరిపోయింది. బుమ్రా వేసిన 46వ ఓవర్ మూడో బంతికి భారీ సిక్స్ కొట్టాడు నబీ.
షమీ హ్యాట్రిక్...
ఈ ప్రపంచకప్‌లో తొలిసారి తుది జట్టులో బరిలోకి దిగిన భారత పేసర్ షమీ అరుదైన ఘనత సాధించాడు. అడుగుపెట్టిన తొలిమ్యాచ్‌లోనే హ్యాట్రిక్ వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 49వ ఓవర్ 3వ బంతికి నబీ(52)ని ఔట్ చేసిన షమీ... వరుస బంతుల్లో అప్తాబ్, ముజీబ్ వికెట్లను తీశాడు.
ధోనీ స్టంపౌట్...
ఇప్పటివరకు 344 వన్డేలు ఆడిన భారత వికెట్ కీపర్ ధోనీ... కెరీర్లో రెండోసారి స్టంపౌట్ అయ్యాడు. 44 ఓవర్ 3వ బంతి వేసిన రషీద్ ఖాన్.. మహీని ఔట్ చేశాడు. అఫ్గాన్ కీపర్ ఇక్రమ్ అలీ తనదైన వేగంతో ధోనీని ఔట్ చేసి సంబరాల్లో మునిగిపోయాడు.
బ్లూతోనే...
అఫ్గాన్ - భారత జట్ల జెర్సీలు ఒకే రంగులో ఉండటం వల్ల ఈ మ్యాచ్‌లో ఎవరో ఒకరు నారింజ రంగు జెర్సీ ధరిస్తారని అంతా భావించారు. కానీ ఎలాంటి మార్పు లేకుండానే బరిలోకి దిగింది టీమిండియా. రెండు జట్ల దుస్తులు ఒకే రంగులో ఉన్నప్పుడు అందులో ఒక జట్టు భిన్నమైన రంగు జెర్సీ ధరించాలని ఐసీసీ కొత్త నిబంధన తీసుకొచ్చింది. అయితే ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో మ్యాచ్‌లో మాత్రం రంగు మారే అవకాశం ఉందని సమాచారం.
పంత్‌కు నో...
పసికూన అఫ్గాన్‌తో మ్యాచ్‌లో కోహ్లీ ప్రయోగానికి సిద్ధపడతారని అందరూ అనుకున్నారు. ఎందుకంటే రిజర్వ్‌లో ఉన్న పంత్‌కు అవకాశం ఇచ్చి విజయ్ శంకర్‌కు విశ్రాంతి ఇస్తారని నిపుణులు విశ్లేషించారు. కానీ గాయం నుంచి కోలుకున్న విజయ్ శంకర్ అనూహ్యంగా తుది జట్టులో చోటు సంపాదించి ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు.
50వ విజయం...
అఫ్గాన్‌పై గెలిచిన టీమిండియా ప్రపంచకప్‌లో మరో ఘనత సాధించింది. ఈ తాజా విజయంతో మెగాటోర్నీలో 50వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 79 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 50వ గెలుపు ఖాతాలో వేసుకుంది. ఆస్ట్రేలియా 90 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగి 67 విజయాలు సాధించింది.
తక్కువ పరుగులతో విజయం..
ఈ ప్రపంచకప్‌లో అఫ్గాన్‌పై 11 పరుగుల అతి స్వల్ప తేడాతో విజయం సాధించింది టీమిండియా. గతంలో న్యూజిలాండ్‌పై 16 పరుగుల తేడాతో గెలిచిందే ఇప్పటివరకు భారత్ అత్యల్ప రికార్డు.
వరుసగా 11 సార్లు...
2011 ప్రపంచకప్‌లో నాగ్‌పుర్‌లో దక్షిణాఫ్రికాతో తలపడిన భారత జట్టు లీగ్ దశలో అపజయం పొందింది. ఆ మ్యాచ్ తర్వాత నుంచి ఇప్పటివరకు వరుసగా 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మన తర్వాత వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ 10 వరుస విజయాలతో ఉంది. గతంలో ఆస్ట్రేలియా 13 వరుస విజయాలు సాధించింది.
ఇది చదవండి: అమ్మో అఫ్గాన్- ఉత్కంఠ పోరులో భారత్ గెలుపు