ప్రస్తుతం టీమ్ఇండియా పేస్ దళం అద్భుతంగా రాణిస్తోంది. భారత పేసర్లు ఒకప్పటి వెస్టిండీస్ బౌలర్లను గుర్తు చేస్తున్నారని పలువురు ప్రశంసలు కూడా కురిపించారు. తాజాగా ఈ విషయంపై స్పందించాడు భారత జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్. పేసర్ల విజయానికి గల కారణమేంటో వివరించాడు.
"తన సామర్థ్యానికి తగ్గట్లు ఓ పేసర్ ఎన్ని ఓవర్లు నిలకడగా బౌలింగ్ చేయగలడో లెక్కగడతాం. కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయాల్సి వస్తుంది. అపుడు అతని శరీరంపై ఏమాత్రం ఒత్తిడి ప్రభావం పడుతుంది అనే విషయాన్ని జీపీఎస్ ట్రాకర్ ద్వారా బౌలర్ కదలికలను గమనిస్తూ తెలుసుకుంటాం. ఉదాహరణకు, ఓ బౌలర్ మైదానంలో 20 కిలోమీటర్లు పరిగెత్తాడు. ఆ సమయంలో అతడి శరీరంపై ప్రభావం ఎంత పడింది, పరిగెత్తడానికి ముందు, పరిగెత్తే సమయంలో, పరిగెత్తడం పూర్తయ్యాక.. అతడి శరీరంలో కదలికలు ఎలా ఉన్నాయి? ఎలాంటి మార్పులు వచ్చాయి అని విశ్లేషిస్తాం. దీనిద్వారా ఎంత మేరకు ఓ బౌలర్‌కు శిక్షణ అవసరమో, మరింత మెరుగ్గా ఎలా తీర్చిదిద్దాలో అనేది అంచనా వేసి అందుకు అనుగుణంగా శిక్షణ ఇస్తాం. అందుకే టీమ్ఇండియా పేస్ దళం సమర్ధవంతంగా ఏ జట్టు బ్యాట్స్‌మెన్‌నైనా ఎదుర్కోగలుగుతుంది. ప్రస్తుతం మన పేసర్లు 140కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేయగలరు. "
-భరత్ అరుణ్, టీమ్ఇండియా బౌలింగ్ కోచ్.
జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ లాంటి వైవిధ్యమైన బౌలర్లతో టీమ్ఇండియా ప్రపంచంలో ఉత్తమ పేస్ దళాల్లో ఒకటిగా కొనసాగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేయగల సామర్థ్యాన్ని వీరు కూడగట్టుకున్నారు.
ఇది చూడండి : 'ఆర్చర్‌తో స్నేహం ఆఫ్‌ఫీల్డ్‌కే పరిమితం'