టీ20 మహిళా ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. కెప్టెన్‌గా దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను వణికించింది. వరల్డ్‌కప్‌లో కంగారూలకు ఓటమి రుచి చూపించడంలో కీలకపాత్ర పోషించింది. ఆమెనే హర్మన్‌ప్రీత్ కౌర్. ఈరోజు ఈమె 31వ వసంతంలోకి అడుగుపెట్టింది. అంతేకాకుండా ఈరోజే టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హర్మన్ గురించి పలు విషయాలివే...
పిన్నవయసులోనే భారత సారథిగా
ఇప్పుడంటే మహిళలు చాలామంది క్రికెట్లోకి వస్తున్నారు. కానీ రెండు దశాబ్దాల కిందట అమ్మాయిలు బ్యాట్ పడితే ఆశ్చర్యంగా చూసేవాళ్లు. అలాంటి రోజుల్లో ఈ ఆటను కెరీర్‌గా ఎంచుకుందామె. పంజాబ్‌లోని దారాపూర్ అనే గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన హర్మన్.. చిన్నపుడు క్రికెట్ ఆడుతుంటే స్వయంగా ఆమె తమ్ముడే ఎగతాళి చేసేవాడు. నువ్వు క్రికెట్ ఆడి ఏం చేస్తావ్? అని చాలామంది అనేవాళ్లు. ఆమెతో కలిసి ఆడేందుకు అమ్మాయిలే ఉండేవారు కాదు. అయినా సరే వెనుకంజ వేయలేదు. అబ్బాయిలతోనే సాధన చేసేది.
- హర్మన్ చదివిన స్కూల్ యజమానికి క్రికెట్ అకాడమీ ఉండేది. ఆమె ఆసక్తిని గమనించి.. ఉచితంగా వసతి కల్పించి, శిక్షణ ఇప్పించాడు. అక్కడే ఆటలో మెరుగులు దిద్దుకున్న హర్మన్.. ఆ తర్వాత ముంబయిలో ఒక్కతే హాస్టల్లో ఉంటూ సాధన సాగించింది.
- 2009 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ఆడే అవకాశం దక్కించుకున్న హర్మన్.. తొలి టోర్నీలోనే సత్తా చాటింది. వేటాడే పులిలా క్రీజులో కదిలే హర్మన్.. మహిళల క్రికెట్లో పవర్ హిట్టింగ్‌కు పర్యాయ పదమైంది.
- 2012లో ఆమె, భారత టీ20 జట్టు పగ్గాలందుకుని పిన్నవయసులో కెప్టెన్ అయి రికార్డులకెక్కింది. విదేశీ టీ20 లీగ్‌లో ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారతీయురాలు ఆమెనే కావడం మరో విశేషం. ఆస్ట్రేలియాలో జరిగే మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్.. ఆమెకు 2016లో కాంట్రాక్టు ఇచ్చింది. తొలి సీజన్లోనే మెరుపులు మెరిపించింది. ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఆమె రికార్డులకు కొదువే లేదు.
పుట్టగానే క్రికెట్ చొక్కా!
హర్మన్ పుట్టిన కొన్ని రోజులకు ఆమె తండ్రి కమల్‌దీశ్.. పట్టణం నుంచి చొక్కా ఒకటి తెచ్చాడు. దాని మీద క్రికెటర్ బ్యాటింగ్ చేస్తున్న బొమ్మ ఉండటం విశేషం. అప్పటికి హర్మన్ తండ్రికి క్రికెట్ గురించి ఆలోచనే లేదు. ఆమె ఎదిగే వయసులో హాకీ నేర్పాలనుకున్నాడు. కానీ ఆమె మాత్రం క్రికెట్‌నే ఇష్టపడింది. పట్టుబట్టి దాన్నే కెరీర్‌గా ఎంచుకుంది. హర్మన్ పెరిగి పెద్దయ్యాక తన తండ్రి చిన్నప్పుడు తెచ్చిన చొక్కా చూసి ఆశ్చర్యపోయింది. దాన్ని ఇప్పటికీ భద్రంగా దాచుకుంది. హర్మన్ జీవితం క్రికెట్‌తో ముడిపడి ఉంది కాబట్టే చిన్నపుడు తను చొక్కా తెచ్చానేమో అంటాడు కమల్‌దీశ్.
ఒక్క ఇన్నింగ్స్.. ఒకే ఒక్క ఇన్నింగ్స్!
ఓ ఇన్నింగ్స్ వల్ల ఓ జట్టు ముఖచిత్రం మారిపోతుందా? ఆ జట్టు సభ్యుల జీవితాలు మారిపోతాయా? దేశంలో ఆటను చూసే కోణమే మారిపోతుందా? ఈ మాటలు చాలా నాటకీయంగా అనిపిస్తున్నాయా? కానీ ఇది నిజం. గత ఏడాది మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై హర్మన్‌ప్రీత్ 171 పరుగుల ఇన్నింగ్స్.. భారత మహిళల క్రికెట్లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. అసలు మహిళల క్రికెట్ చరిత్రలోనే అదొక సంచలన ఇన్నింగ్స్. ఆస్ట్రేలియా లాంటి భీకరమైన జట్టులోని మేటి బౌలర్లను చితక్కొడుతూ సాగిన ఆమె ఇన్నింగ్స్ మామూలు మజానివ్వలేదు. పురుషుల ఆటకు దీటైన వినోదం మహిళల ఆటలోనూ ఉందని చాటిన శతకమది.
అప్పటిదాకా మహిళల ఆటను తేలిగ్గా తీసుకున్న అభిమానులు.. ఆ ఇన్నింగ్స్‌తో అభిప్రాయం మార్చుకున్నారు. అప్పటి నుంచి సీరియస్‌గా వాళ్ల ఆటను చూస్తున్నారు. ఆ మ్యాచ్‌తో ఒక్కసారిగా టోర్నీ వీక్షకుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. పురుషుల ఫైనల్‌ను చూసినట్లే మహిళల తుది పోరునూ కోట్ల మంది చూశారు. ఆ మ్యాచ్ వీక్షకుల సంఖ్య చూసి నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. ఆ టోర్నీతో ఒక్కసారిగా దేశంలో మహిళల క్రికెట్ ఆదరణ పెరిగింది. అమ్మాయిలకు స్పాన్సర్లు పెరిగారు. హర్మన్ సహా చాలామందికి వాణిజ్య ఒప్పందాలు దక్కాయి. వారి జీతాలు పెరిగాయి, మ్యాచ్ ఫీజులు పెరిగాయి. అలాగే మహిళల జట్టులో ఆత్మవిశ్వాసమూ పెరిగింది. మిగతా వాళ్లూ అదురు బెదురు లేకుండా ఆడుతున్నారు. ప్రపంచ క్రికెట్లో భారత్ ఇప్పుడు బలమైన జట్టుగా ఎదిగింది.
జట్టులో స్టార్‌గా ఎదిగిన స్మృతి మంధానను కదిపితే.. " హర్మనే నాకు స్ఫూర్తి. ఆమె బ్యాటింగ్ చూసే నేనూ ఆత్మవిశ్వాసంతో, దూకుడుతో ఆడటం అలవాటు చేసుకున్నా" అంటుంది. ఆల్‌రౌండర్ ఏక్తా బిష్త్‌ను అడిగితే.. "హర్మన్ 171 పరుగుల ఇన్నింగ్స్ లేకుంటే మేం ఈ రోజు ఇన్ని ఆర్థిక ప్రయోజనాలు పొందేవాళ్లమే కాదు" అని తేల్చి చెబుతుంది. దీన్ని బట్టే హర్మన్ ఇన్నింగ్స్ ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సచిన్, విరాట్ వంటి ఆటగాళ్లు ఆమె ఆటను ప్రశంసించారు.
ఆ టోర్నీ ఆడాల్సిందే కాదు
ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై 171 పరుగుల హర్మన్ ఇన్నింగ్స్. భారత మహిళా క్రికెట్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయేదే! ఐతే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. హర్మన్ ఆ ప్రపంచకప్‌లో ఆడటమే ఒక దశలో సందేహంగా మారింది. వెన్ను నొప్పి కారణంగా కొన్నాళ్లు మైదానానికి దూరంగా ఉన్న హర్మన్.. ప్రపంచకప్‌కు ముందు పేలవ ఫామ్‌లో కొనసాగింది. 17 ఇన్నింగ్స్‌ల్లో కనీసం అర్ధసెంచరీ చేయలేదు. ఫలితంగా హర్మన్‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేస్తారా? అన్న సందేహాలు కలిగాయి. ఇందుకు తోడు టోర్నీ మొదలయ్యాక హర్మన్ ఎడమ చేతి వేలికి గాయమైంది. ఫలితంగా ప్రపంచకప్‌లో తన కథ ముగిసిందంటూ సహచరుల దగ్గర ఏడ్చింది. కానీ ఫిజియో ట్రేసీ ఫెర్నాండెజ్ ఆమెకు ధైర్యం చెప్పి కసరత్తులు చేయించింది. మ్యాచ్‌కు సిద్ధం చేసింది.
న్యూజిలాండ్‌పై అర్ధసెంచరీతో ఆత్మవిశ్వాసం అందుకున్న హర్మన్.. తర్వాత ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో విశ్వరూపం చూపించింది. ముందు మామూలుగానే ఆడినా.. ఆస్ట్రేలియా లాంటి జట్టుకు చిన్న లక్ష్యమైతే సరిపోదని, భారీ స్కోరు చేయాలని నిర్ణయించుకుని గేర్లు మార్చింది. ఈ క్రమంలో మహిళల క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడింది. నిజానికి ఆ టోర్నీలోనే కాదు.. తన కెరీర్‌లో తరచుగా ఆమె గాయాలు, అనారోగ్య సమస్యలో ఇబ్బంది పడింది. ఆమెకు ఒళ్లంతా గాయాలే. హర్మన్ చర్మం చాలా సున్నితంగా తయారై.. కొన్నిసార్లు తోలు ఊడిపోవడం సమస్యగా మారి, ఓ దశలో థైప్యాడ్ ధరించలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించి ఆమె కెరీర్లో అత్యున్నత స్థాయిని అందుకుంది. క్రికెట్లో ప్రతిభకుగానూ ఈమెకు అర్జున అవార్డు ఇచ్చి సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.