ఇంగ్లాండ్ రొటేషన్ పద్ధతిపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఆ జట్టు నుంచి మరో క్రికెటర్ ఇంటి బాట పట్టాడు. భారత్‌లో పర్యటిస్తున్న జట్టు నుంచి ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్‌ను తప్పించింది ఇంగ్లీష్ టీం యాజమాన్యం. రొటేషన్ పాలసీలో భాగంగా ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ మేరకు నిర్ణయించింది ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ).
దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్ పర్యటనలకు వోక్స్‌ను తుది జట్టులోకి తీసుకున్నా ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. వోక్స్ చివరిసారిగా గతేడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో ఆడాడు.
ఇంగ్లాండ్ రొటేషన్ పద్దతిపై కెవిన్ పీటర్సన్, ఇయాన్ బెల్ సహా మాజీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లు ఉన్నప్పుడు రొటేషన్ పాలసీ అమలు చేయడాన్ని బెల్ తప్పుబట్టాడు.
భారత్‌తో పర్యటన సందర్భంగా ఈ పాలసీ ప్రకారం తొలి రెండు టెస్టులు ఆడిన జోస్ బట్లర్, మొయిన్ అలీ తిరిగి స్వదేశానికి వెళ్లారు. మొదటి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న బెయిర్‌స్టో, మార్క్ వుడ్ తదుపరి సిరీస్ కోసం జట్టులో చేరారు. 4 మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం 2-1తో టీమ్ఇండియా ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టు మొతేరాలో మార్చి 4న ప్రారంభంకానుంది.
ఇదీ చూడండి: 2 రోజుల్లోనే ముగిసిన పింక్ టెస్టు- భారత్‌దే విజయం