తొలి వన్డేలో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన కోహ్లీసేన రెండో పోరుకు సిద్ధమైంది. 2-0తో సిరీస్ కొట్టేయాలని భావిస్తోంది. శ్రేయస్ అయ్యర్‌కు గాయంతో సూర్యకుమార్ అరంగేట్రం ఖాయమైంది. టీ20 సిరీస్‌ను త్రుటిలో చేజార్చుకున్న మోర్గాన్ సేన వన్డేల్లోనైనా దుమ్మురేపాలన్న పట్టుదలతో. శుక్రవారం టీమ్‌ఇండియాను ఢీకొట్టేందుకు సై అంటోంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది.
రిజర్వ్ బెంచ్ సత్తా
ఆటగాళ్ల విషయంలో టీమ్‌ఇండియాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒక్కో స్థానానికి ముగ్గురు నలుగురు పోటీపడుతున్నారు. అందుకే భుజం స్థానభ్రంశం చెందడం వల్ల శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరమైనా బాధపడటం లేదు. టీ20ల్లో దుమ్మురేపిన సూర్యకుమార్ యాదవ్ అరంగేట్రానికి సిద్ధమైపోయాడు. 360 డిగ్రీల్లో' షాట్లు బాదేందుకు ఉవ్విళ్లూతున్నాడు. రవీంద్ర జడేజా స్థానాన్ని సుదీర్ఘ ఫార్మాట్లో అక్షర్ పటేల్ అందిపుచ్చుకోగా వన్డేల్లో కృనాల్ పాండ్యా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో పేరు తెచ్చుకున్న ప్రసిద్ధ్ కృష్ణ అరంగేట్రంలో అదుర్స్ అనిపించాడు. దీంతో జడ్డూ, షమీ, బుమ్రా వస్తే టీమ్‌ఇండియా బలం మరింత పెరగనుంది.
ఫామ్‌లోకి గబ్బర్, రాహుల్
తొలి వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ రాణించడం జట్టుకు శుభవార్త. 2 పరుగుల తేడాతో శతకం చేజార్చుకున్నప్పటికీ అతడు వేసిన పునాదే టీమ్‌ఇండియాకు కీలకంగా మారింది. రెండో మ్యాచులో అతడు మరింత చెలరేగే అవకాశం ఉంది. మోచేతికి గాయం కావడం వల్ల తొలి మ్యాచ్‌లో రోహిత్ ఫీల్డింగ్ చేయలేదు. బహుశా అతడు కోలుకుంటాడని అంటున్నారు. లేదంటే అతడి స్థానం భర్తీ చేసేందుకు శుభ్‌మన్ గిల్ సిద్ధంగా ఉన్నాడు. ఇక రాహుల్ మిడిలార్డర్‌లో కొనసాగనున్నాడు. అతడు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి తిరిగి ఫామ్‌లోకి రావడం వల్ల కోహ్లీసేన సంతోషంగా ఉంది. ఒకవేళ పంత్ తుది జట్టులోకి వచ్చినా రాహులే కీపింగ్ చేస్తాడని సమాచారం.
అదే బౌలింగ్ దళం
తొలి మ్యాచ్‌లో 9 ఓవర్లు వేసి 68 పరుగులు ఇచ్చిన కుల్‌దీప్ స్థానంలో చాహల్ జట్టులోకి వస్తాడని అంచనా. మొదటి వన్డేలో ఆకట్టుకున్న భువనేశ్వర్ (2), శార్దూల్ ఠాకూర్(3), ప్రసిద్ధ్ కృష్ణ (4) ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌పై మరోసారి దాడికి దిగుతారు. ఒకవేళ మరింత వైవిధ్యం జోడించాలనుకుంటే శార్దూల్ స్థానంలో సిరాజ్ లేదా నటరాజన్‌కు అవకాశం దక్కొచ్చు. పాండ్యా సోదరులు ఎప్పటిలాగే కీలకం కానున్నారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ బాధ్యతలను పంచుకోనున్నారు.
గాడిన పడటం ముఖ్యం
మొదటి వన్డేలో సునాయాసంగా గెలిచేలా కనిపించిన ఇంగ్లాండ్‌ను మిడిలార్డర్ వైఫల్యమే దెబ్బతీసింది. ఓపెనర్లు జానీ బెయిర్ స్టో (94; 64 బంతుల్లో), జేసన్ రాయ్ (46) మెరుపు ఆరంభాన్నిచ్చారు. నిర్భయంగా ఆడుతూ మైదానం నలుమూలలా షాట్లు బాదేశారు. 14 ఓవర్లకే 135 పరుగులు సాధించారు. అయితే మిడిలార్డర్లో బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, మొయిన్ అలీ ఆకట్టుకోలేకపోయారు. కెప్టెన్ మోర్గాన్ కూడా గాయం కారణంగా సామర్థ్యం మేరకు ఆడలేదు. సామ్ బిల్లింగ్స్ గాయపడ్డాడు. వీరిద్దరూ రెండో వన్డేలో ఆడటంపై స్పష్టత లేదు. ఒకవేళ ఇంగ్లాండ్ భారీ లక్ష్యం నిర్దేశించాలన్నా.. ఛేదించాలన్నా వీరంతా దూకుడుగా ఆడటం ముఖ్యం. ఆదిల్ రషీద్, మొయిన్ అలీ తమ స్పిన్‌తో టీమ్‌ఇండియాను ఇబ్బంది పెట్టలేకపోయారు. దాంతో ఇంగ్లీష్ జట్టు మార్క్ వుడ్, టామ్ కరన్, సామ్ కరన్, బెన్‌స్టోక్స్ పేస్ దాడినే నమ్ముకుంటోంది.