ఐపీఎల్లో ఆడటం చాలా బాగుంటుందని సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. అయితే, ఈ ఏడాది టోర్నమెంట్ నిర్వహణ కోసం మరిన్ని ప్రణాళికలు, కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించాడు.

"ఐపీఎల్లో ఆడటం అంటే ఎప్పటికీ అద్భుతమైన విషయమే. కచ్చితంగా అందులో ఆడటం, లీగ్‌లో భాగం కావడం నాకెంతో ఇష్టం. అయితే, తుది నిర్ణయాలు తీసుకునే ముందు చాలా వివరాలు తెలియాల్సి ఉంది. టీ20 వాయిదా వేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఐపీఎల్ నిర్వహించాల్సిన అవసరం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆటగాళ్లతో మాట్లాడే ముందు అధికారులు అన్ని ప్రణాళికలపై ఓ స్పష్టత తెచ్చుకుంటారని నా అభిప్రాయం."
-కేన్ విలియమ్సన్, న్యూజిలాండ్ కెప్టెన్
కరోనా కారణంగా టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్‌ను జరిపే ప్రణాళికలు రచిస్తోంది బీసీసీఐ.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో న్యూజిలాండ్ సఫలమైన నేపథ్యంలో విలియమ్సన్. మౌంట్ మౌంగనుయ్‌లోని బే ఓవల్ వద్ద శిక్షణ ప్రారంభించాడు. ఇప్పటికే చాలా మంది కివీస్ ఆటగాళ్లు(పురుషులు, మహిళలు) రెండు వేర్వేరు శిబిరాల్లో ట్రైనింగ్ మొదలు పెట్టారు.
