సెలబ్రిటీల లవ్‌స్టోరీ, పెళ్లి టాపిక్.. ఇలా వారి వ్యక్తిగత జీవిత విషయాలను తెలుసుకోవడంలో ఉత్సుకత చూపించడం సర్వసాధారణం. అయితే క్రికెట్ విషయానికొస్తే కోహ్లీ, హార్దిక్, రోహిత్ సహా కొంతమంది ఆటగాళ్ల ప్రేమకథలను విని ఉంటాం. వీరు సోషల్‌మీడియా లేదా ప్రత్యేక ఇంటర్వ్యూల ద్వారా తమ వ్యక్తిగత విశేషాలను అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటుంటారు.
కానీ స్టార్ కపుల్ టీమ్ఇండియా మాజీ సారథి ధోనీ, సాక్షి లవ్‌స్టోరీ మాత్రం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే వారిద్దరు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏ విషయమైన అభిమానులతో పంచుకోవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయినా తెలుసుకోవాలనే ఉత్సుకత మాత్రం ప్రతిఒక్క అభిమానికి తప్పకుండా ఉంటుంది. నేడు వీరిద్దరి పెళ్లి రోజు సందర్భంగా వారి లవ్‌స్టోరి గురించి ప్రత్యేక కథనం మీకోసం..
చిన్నప్పటి నుంచే
ధోనీ, సాక్షి తండ్రులు ఇద్దరు ఒకేచోట కలిసి పనిచేసేవారు. అలా వీరిద్దరు కూడా ఒకే చోట కలిసి చదువుకున్నారు. అయితే మహీ మాత్రం సాక్షికి సీనియర్. కానీ మంచి స్నేహితులుగా ఉండేవారు. ఆ తర్వాత సాక్షి తండ్రికి ఉద్యోగం బదిలీ అవ్వడం వల్ల వేరే చోటుకు తమ మకాం మార్చారు. దీంతో వీరు చాలా కాలం దూరంగానే ఉన్నారు.
అలా ప్రేమలో పడ్డారు
2007లో అనుకోకుండా ఓ కామన్ స్నేహితుడి ద్వారా వీరిద్దరు మళ్లీ కలుసుకున్నారు. అప్పటికే మహీ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అదే సమయంలో సాక్షి ఓ హోటల్లో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. అనుకోకుండా ఓ రోజు మ్యాచ్‌లో భాగంగా అదే హోటల్లో బసకు దిగారు టీమ్ఇండియా ఆటగాళ్లు. అయితే సాక్షికి తెలియకుండా ఆ హోటల్ మేనేజర్ దగ్గర నుంచి ఆమె ఫోన్ నెంబరు తీసుకుని తనకు మెసేజ్‌లు చేయడం ప్రారంభించాడు ధోనీ. అలా క్రమక్రమంగా వారి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. అలా వీరిద్దరు 2008లో ప్రేమలో పడ్డారు. అప్పటికే పలువురు బాలీవుడ్ భామలతో ధోనీకి అఫైర్స్ నడుస్తున్నట్లు చాలా పుకార్లు కూడా వచ్చాయి. కానీ వాటన్నింటికి చెక్ పెడుతూ 2010లో జులై 4న సాక్షిని వివాహమాడాడు మహీ. ప్రస్తుతం వీరిద్దరికి ఓ కూతురు కూడా ఉంది.
నీలినీడలు
గతేడాది ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో సెమీస్‌లో చివరగా ఆడిన ధోనీ.. ఆ తర్వాత ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. దీంతో పంత్, కేఎల్ రాహుల్ టీమ్ఇండియా వికెట్‌కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. అయితే ఐపీఎల్లో ఆడి, టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలని ధోనీ భావించాడు. కానీ కరోనా ప్రభావంతో ప్రపంచకప్ వాయిదా పడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో మహీ అంతర్జాతీయ కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఇది చూడండి : 'నేను చూశా.. ధోనీలో జోరు ఏమాత్రం తగ్గలేదు'