యాషెస్ నాలుగో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు శతకాలు, ఒక అర్ధశతకం సాధించాడు. 147.25 సగటుతో రాణిస్తున్నాడు.
ఏడాది నిషేధం తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో పునరాగమనం చేసిన స్మిత్.. ఇటీవలే ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. కోహ్లీ 25 శతకాల రికార్డును అధిగమించాడు. ఇప్పుడు కోహ్లీ, స్మిత్‌లలో ఎవరు గొప్ప అనే విషయం చర్చనీయాంశమైంది. తాజాగా ఈ ప్రశ్నపై స్పందించాడు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్. విరాట్ తన అభిమాన క్రికెటర్ అని చెప్పిన షేన్... టెస్టుల్లో మాత్రం స్మిత్ పేరు సూచిస్తానని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
" ప్రపంచ క్రికెట్‌లో కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్. టెస్టుల్లో మాత్రం స్మిత్ పేరు సూచిస్తా. అలా కాకుండా అన్ని ఫార్మాట్లలో అని అడిగితే మాత్రం కోహ్లీకే నా ఓటు. విరాట్ ఒక లెజెండ్. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నేను చూసిన అత్యుత్తమ ఆటగాడు వివ్ రిచర్డ్స్. అతడిని కూడా కోహ్లీ అధిగమించాడు ". -షేన్ వార్న్, ఆసీస్ మాజీ క్రికెటర్
అన్ని ఫార్మాట్లలో కలిపి 68 శతకాలు చేసిన విరాట్... మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 100 శతకాల రికార్డును కచ్చితంగా అధిగమిస్తాడని జోస్యం చెప్పాడు వార్న్.
ఇదీ చదవండి...యాషెస్: స్మిత్ 'డబుల్'... పటిష్ఠ స్థితిలో ఆసీస్