టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా శనివారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు సాయంత్రం 19.29 గంటలకు తాను రిటైరైనట్లు భావించమని ధోనీ ప్రకటించిన కొద్ది సేపటికే రిటైర్మెంట్ ప్రకటించాడు సురేశ్ రైనా. వారిద్దరూ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత జరిగిన అద్భుతమైన క్షణాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు రైనా.
"శనివారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని మేమిద్దరం అప్పటికే నిర్ణయించుకున్నాం. ధోనీ జెర్సీ నంబరు 7.. నాది 3. ఈ రెండింటిని కలిపితే 73 అంకె వస్తుంది. మనకు స్వాతంత్య్రం వచ్చి ఆగస్టు 15 నాటికి 73 ఏళ్లు పూర్తయింది. కాబట్టి అంతకంటే మంచి రోజు ఉండకపోవచ్చని భావించాం. ధోనీ.. తన కెరీర్‌ను 2004 డిసెంబరు 23న చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో ప్రారంభించగా.. నేను 2005 జులై 30న శ్రీలంకపై జరిగిన వన్డేలో అరంగేట్రం చేశా. మేమిద్దరం అంతర్జాతీయ క్రికెట్లో కలిసి మొదలయ్యి, చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులో కలిసే ఆడుతున్నాం. అందువల్ల మేమిద్దరం కలిసే వీడ్కోలు ప్రకటించాం. కానీ, ఐపీఎల్లో మా ఆటను కొనసాగిస్తాం."
- సురేశ్ రైనా, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
చెన్నై చేరుకున్న తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని తనకు ముందే తెలుసని వెల్లడించాడు సురేశ్ రైనా. రిటైర్మెంట్ ప్రకటన తర్వాత తామిద్దరం కలిసి కౌగిలించుకుని బాగా ఏడ్చామని రైనా తెలిపాడు. ఆ తర్వాత సీఎస్కే ఆటగాళ్లతో రాత్రంతా గడిపామని వెల్లడించాడు.
యూఏఈ వేదికగా సెప్టెంబరు 19న ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ధోనీ, రైనాలు కలిసి చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.