టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అలెన్ బోర్డర్ ప్రశంసల జల్లు కురిపించారు. దూకుడుతో పాటు అంకిత భావంతో ఆటను ప్రేమించే కోహ్లీకి తాను వీరాభిమాని అని పేర్కొన్నారు. విరాట్‌కు అపారమైన ప్రతిభ ఉందని, సానుకూల ధోరణితో ఆడతాడని తెలిపారు. పితృత్వ సెలవులపై కోహ్లీ ఆసీస్‌తో చివరి మూడు టెస్టులకు దూరమవ్వడం భారత జట్టుకు తీరని లోటని అభిప్రాయం వ్యక్తం చేశారు.
విరాట్ సతీమణి అనుష్క శర్మ ఆస్ట్రేలియాలో ప్రసవిస్తుందని, దీంతో కోహ్లీ సంతానాన్ని తమ దేశానికి చెందినవారిగా పరిగణించవచ్చని ఆశించామని వర్చువల్ మీడియా సమావేశంలో అలెన్ సరదాగా వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు అనంతరం కోహ్లీ భారత్‌కు తిరిగి రానున్నాడు.
" విరాట్ కోహ్లీ తొలి టెస్టులో మాత్రమే ఆడటం ఆస్ట్రేలియాకు కలిసొచ్చే అంశం. ఇది భారత్‌కు తీరని లోటు. బ్యాట్స్‌మన్, నాయకుడిగా అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. కోహ్లీ మనసు పెట్టి ఆడతాడు. దూకుడుతో పాటు అంకిత భావంతో అతడు ఆడే విధానం నాకు ఎంతో ఇష్టం. విరాట్‌ను భారత జట్టు ఎంతో మిస్ అవుతుంది. కోహ్లీ స్పెషల్ ప్లేయర్, అతడికి ఎంతో ప్రతిభ ఉంది. సానుకూల ధోరణితో ఆడుతూ జట్టును గొప్పగా నడిపిస్తాడు. టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తో గెలుస్తుందని భావిస్తున్నా".
-అలెన్ బోర్డర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.
నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో.. భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది.
ఇదీ చదవండి:లంక ప్రీమియర్ లీగ్ 'థీమ్సాంగ్' వచ్చేసిందోచ్..