ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో యువతులతో నిండిన తమదే అత్యంత సంతోషకరమైన జట్టని టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన అంటోంది. సరదాల విషయానికి వస్తే థాయ్‌లాండ్ మాత్రమే తమతో కొంత పోటీపడగలదని నవ్వుతూ చెబుతోంది. ప్రస్తుతం భారత జట్టు సగటు వయసు 23 లోపే ఉంది. జెమీమా రోడ్రిగ్జ్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్ వంటి యువతుల రాకతో డ్రెస్సింగ్ రూమ్‌లో హుషారు ఎక్కువైందని చెప్పింది.
'సరదాగా ఎలా ఉండాలో ఈ బృందానికి కచ్చితంగా తెలుసు. యువ క్రికెటర్లను సౌకర్యవంతంగా ఉంచేందుకే ఇదంతా. అందులో నేనూ ఒకర్ని. మేం నృత్యాలు చేస్తాం. పాటలు పాడుతాం. ఇంకా మరెన్నో చేస్తాం. థాయ్ మాకు కాస్త పోటీనిచ్చేలా ఉన్నప్పటికీ ఈ ప్రపంచకప్‌లో మాదే సంతోషకరమైన జట్టని అనుకుంటున్నా. మా జట్టు వయసు చూస్తూనే ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. ఈ వయసులో సరదాలే కదా ఉంటాయి. అలా లేదంటే మా అమ్మాయిలు ఎందుకో బాధపడుతున్నట్టే లెక్క. ఏడాదిన్నర కాలంగా మా డ్రెస్సింగ్‌రూమ్ ఇలాగే ఉంది. ఇంతకుముందు సరదాగా లేదని చెప్పలేను గానీ టీనేజర్లు వచ్చాక సరికొత్త ఉత్తేజం వచ్చింది. వారు కొత్తగా ఆలోచిస్తున్నారు. వారికేమీ తెలియదు. నిర్భయంగా ఉంటున్నారు. ఒత్తిడేమీ లేదు' -స్మృతి మంధాన
ఇంతకీ ఈ సరదాలకు నాయకత్వం వహించేది ఎవరో తెలుసా? జెమీమా రోడ్రిగ్జ్. కాస్త గిటార్ వాయించడంలో నైపుణ్యమున్న ఈ యువ క్రికెటర్ డ్రెస్సింగ్ రూమ్‌లో అల్లరల్లరి చేస్తుందంటే నమ్మండి!