కరోనా లాక్‌డౌన్‌తో ప్రతిఒక్కరూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తాను కూడా ఇదే సమస్య ఎదుర్కొన్నట్లు చెప్పాడు టీమ్ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్. ఆ సమయంలో తనలోని నైపుణ్యాలు తగ్గిపోతాయేమోనని అనుక్షణం భయపడినట్లు చెప్పాడు. బంతి లైన్ అండ్ లెంగ్త్ సరిగ్గా అంచనా వేయలేకపోతున్నట్లు కలలు వచ్చేవని వెల్లడించాడు. అర్థరాత్రి నిద్రలో నుంచి ఉలిక్కి పడి లేచేవాడినని అన్నాడు. మొత్తంగా నరకయాతన అనుభవించి, విసుగెత్తిపోయినట్లు చెప్పాడు.
సరైన ప్రాక్టీసు లేనందున లాక్డౌన్ తర్వాత జరిగిన తొలి నెట్ సెషన్ అత్యంత భయంకరంగా సాగిందని చెప్పాడు. ఇటీవలే మైదానంలో అడుగుపెట్టిన తొలి అనుభవం గురించి వెల్లడించాడు.
"ఇన్ని రోజులు ఫిట్నెస్ కోసం థ్రెడ్మిల్, కాంక్రీట్ నేలపై పరుగెత్తి, తర్వాత మైదానంలో పరుగెడుతుంటే మబ్బులపై విహరిస్తున్నట్లు హాయిగా అనిపించింది. మొత్తంగా నా ముఖంలో సగం కన్నీళ్లు, సగం నవ్వుతో ప్రాక్టీసు చేశాను"
-కేఎల్ రాహుల్, టీమ్ఇండియా క్రికెటర్
ఈ ఏడాది ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు సారథ్యం వహిస్తున్నాడు రాహుల్. దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19- నవంబరు 10 మధ్య బయోసెక్యూర్ వాతావరణంలో ఈ లీగ్ జరుగనుంది.