దాతృత్వంలో ముందుండే మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్.. మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లకు నడుచుకుంటూ వెళ్తున్న వలసకూలీలకు ఆహార పొట్లాలను అందించాడు.
తన కుటుంబం అంతా కలిసి ఇంట్లోనే ఆహారం తయారుచేయగా.. సెహ్వాగ్ స్వయంగా ప్యాకింగ్ చేశాడు. కార్మికులు తింటున్నప్పుడు తీసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. తన అభిమానులూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరాడు.
"ఇంట్లో తయారు చేసి, ప్యాకింగ్ చేసి కూలీలకు ఇస్తే చాలా ఆనందంగా అనిపించింది. ప్రతి అభిమాని ఇలా 100 మందికి సాయం చేసి ఆ ఫొటోలను నాకు సోషల్మీడియాలో పంపించండి" అని సెహ్వాగ్ రాసుకొచ్చాడు. దీనిపై భజ్జీ ప్రశంసలు కురిపించాడు.
దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన కూలీల కోసం శ్రామిక్ రైళ్లు నడుపుతోంది కేంద్రం. మే 1 నుంచి ఈ కార్యక్రమం మొదలవగా.. ఇప్పటివరకు దాదాపు 44 లక్షల మందికి పైగా సొంతూళ్లకు చేరారు.