టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల్లో, ర్యాంకుల్లోనే కాకుండా మరో విషయంలోనూ అగ్రస్థానంలో నిలిచాడు. గత నాలుగేళ్లలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు వెతికిన క్రికెటర్‌గా నిలిచాడు.ఎస్ఈఎమ్రస్(SEMrush) అనే ఆన్‌లైన్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2015 డిసెంబర్ నుంచి 2019 డిసెంబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా నెలకు సగటున 1.76 మిలియన్ల సార్లు భారత సారథి కోహ్లీ కోసం ఇంటర్నెట్‌లో శోధించారు. తర్వాతి స్థానాల్లో టీమిండియా నుంచి మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్‌శర్మ, సచిన్ తెందూల్కర్, హార్దిక్ పాండ్య, యువరాజ్ సింగ్ ఉన్నారు. వీరి గురించి నెలకు సగటున 9.59, 7.33, 4.51, 3.68, 3.48 లక్షలసార్లు అభిమానులు వెతుకులాట చేశారు.
క్రికెట్‌లోని పదిమంది అత్యుత్తమ ఆటగాళ్లలో టీమిండియా క్రికెటర్లే ఎక్కువగా ఉన్నారని, మిగతా ముగ్గురు స్టీవ్‌స్మిత్, ఏబీ డివిలియర్స్, క్రిస్‌గేల్ అని ఆ సంస్థ పేర్కొంది. భారత్‌తో పాటు విదేశాల్లోని భారత్‌కు చెందిన వారే ఆయా క్రికెటర్ల గురించి ఎక్కువగా శోధించారని చెప్పింది. మరోవైపు టీమిండియా తర్వాత అత్యధికంగా వెతికిన జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. తర్వాతి స్థానాల్లో వెస్టిండీస్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక నిలిచాయి.