టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ 2020ని ఒక్క శతకం లేకుండా పూర్తి చేశాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులే చేసిన అతడు ఈ ఏడాదిని సెంచరీ సాధించకుండా ముగించాడు. దీంతో 2008 తర్వాత తొలిసారి సెంచరీ లేకుండా నిలిచాడు. అతడు అరంగేట్రం చేసిన ఏడాది మినహాయిస్తే కోహ్లీ ఏటా శతకాలతో మైమరపించాడు.
నవంబర్‌లో ఆస్ట్రేలియాతో ఆడిన రెండో వన్డేలో అతడు చేసిన 89 పరుగులే ఈ ఏడాది అత్యధిక స్కోరు కావడం గమనార్హం. మరోవైపు ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ 74 పరుగులు చేసిన అతడు సెంచరీ దిశగా సాగుతుండగా అనూహ్యంగా రహానె తప్పిదానికి రనౌటయ్యాడు.
కోహ్లీ 2020లో మొత్తం 3 టెస్టులు, 9 వన్డేలు, 10 టీ20లు ఆడి వరుసగా 116, 431, 295 పరుగులు చేశాడు. ఇక మొత్తం మీద 86 టెస్టుల్లో 27 శతకాలు, 251 వన్డేల్లో 43 శతకాలు బాదాడు. దీంతో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ తర్వాత అత్యధిక సెంచరీలు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు.
ఈసారి నిరాశే
టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ టాస్ గెలిచాక భారత్ మ్యాచ్ ఓడిపోయిన దాఖలాలు లేవు. దీంతో ఆ సెంటిమెంట్ ఈ పింక్‌బాల్ టెస్టుతో ముగిసింది. మొత్తం 21 సందర్భాల్లో టాస్ గెలిచిన కోహ్లీ అన్ని మ్యాచ్‌లు గెలిచాడు. కానీ ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమి చెందింది భారత్.