ఇష్టమైన పనిలో కష్టముండదు. కష్టం లేని పనిలో అలుపు ఉండదు. అలుపే లేదు కాబట్టి అసంతృప్తికి తావులేదు. అసంతృప్తి ఎరగని చోట ఆనందం తాండవిస్తుంది. ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు కాబట్టే ఎంతోమంది విశ్రాంతి ఎరగక పనిచేస్తున్నారు. అద్భుత విజయాలు అందుకుంటున్నారు. టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీదీ ఇదే తత్వం. అందుకే గత దశాబ్దిలోనే అత్యంత 'బిజీయెస్ట్ క్రికెటర్'గా అవతరించాడు!
ఉపమానాలు చాలవేమో!
అంతర్జాతీయ అథ్లెట్లకు ఏమాత్రం తీసిపోని దేహదారుఢ్యం.. మైదానంలో చిరుతపులిని తలపించే వేగం.. క్రీజులో అడుగుపెడితే పరుగుల వరద పారించే మొనగాడు.. లక్ష్యమెంతమైనా వెనకడుగు వేయని ఛేదన రారాజు.. ప్రత్యర్థులు కవ్విస్తుంటే నువ్వెంతంటూ రెచ్చిపోయే దూకుడు.. సొగసైన క్రికెటింగ్ షాట్లు.. అబ్బురపరిచే చేతి-కంటి సమన్వయం.. ఔరా! అనిపించే ఘనతలు.. చెప్పుకుంటూ పోతే 'కింగ్ కోహ్లీ'ని వర్ణించేందుకు ఉపమానాలు సరిపోవేమో! కానీ పై లక్షణాలన్నీ అతడికి ఒక్కరోజులోనో.. ఒక్క నెల్లోనో.. ఒక్క ఏడాదిలోనో అబ్బలేదు. ఇందుకు అతడెంతో శ్రమించాడు. ఎన్నెన్నో త్యాగాలు చేశాడు. ఎన్నో అలవాట్లను మార్చుకున్నాడు. నోరూరించే వంటకాలను కాదనుకున్నాడు. అందుకే ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్‌గా ఎదిగాడు. 2010 నుంచి 2019 మధ్యలో ఈ భూమ్మీద అత్యంత బిజీ క్రికెటర్‌గా మారాడు.
బిజీ.. బిజీ
2008లో అరంగేట్రం చేసిన విరాట్ తొలి రెండేళ్లలో ఆడింది 15 వన్డేలే. చేసింది 484 పరుగులే. ఇక క్రికెటింగ్ రోజుల్ని లెక్కిస్తే పదిహేనే. కానీ 2010-2019 మధ్య కాలంలో మాత్రం అత్యధిక క్రికెటింగ్ రోజులతో దుమ్మురేపాడు. కింగ్ కోహ్లీ ఆ దశాబ్దంలో 668 రోజులు క్రికెట్ ఆడాడు. అందులో 336 టెస్టు, 227 వన్డే, 75 టీ20 క్రికెటింగ్ రోజులు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో మరెవ్వరికీ ఇలాంటి ఘనత లేదు. శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ (608 రోజులు), ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (593), న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ (571), జో రూట్ (568) అతడి తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక రెండో స్థానంలోని మాథ్యూస్ కన్నా విరాట్ 60 రోజుల స్పష్టమైన ఆధిక్యంతో ఉండటం గమనార్హం. ఇక ఆ పదేళ్లలో ఎక్కువ బంతులు ఎదుర్కొన్న క్రికెటర్ కూడా కోహ్లీయే. అన్ని ఫార్మాట్లలో కలిపి 26,185 బంతులు ఆడాడు. రెండో స్థానంలోని హషీమ్ ఆమ్లా (22,331) కన్నా 17% ఎక్కువగా బంతులు ఎదుర్కొన్నాడు.
అనురక్తితో అద్భుతాలు
గత దశాబ్దిలో విరాట్ కోహ్లీ అందరికన్నా ఎక్కువ క్రికెట్ ఆడేందుకు, బంతులు ఎదుర్కొన్నందుకు అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైంది నిలకడ. పరిమిత ఓవర్ల క్రికెట్లో రెచ్చిపోయే విరాట్ సుదీర్ఘ ఫార్మాట్లో ఇటుకపై ఇటుక పేర్చినట్టు కళాత్మకంగా పరుగులు సాధిస్తాడు. ప్రతి సిరీస్, పర్యటనలో కనీసం ఒకటి లేదా రెండు శతకాలు బాదేస్తుంటాడు. ఆటపై ఎంతో అనురక్తి, తన బ్యాటింగ్‌పై అచంచల విశ్వాసం, టెక్నిక్‌పై పట్టుతోనే ఇవి సాధ్యం.
ఓటమిని అంగీకరించేందుకు ఇష్టపడని కోహ్లీ ఆఖరి బంతి వరకు ఓపికగా పరుగులు చేస్తాడు. ప్రతి మ్యాచును గెలిచేందుకే ఆడతాడు. తనకిష్టమైన క్రికెట్‌ను ఎక్కువ కాలం ఆస్వాదించేందుకు దేహదారుఢ్యం అవసరమని స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ శంకర్‌బసు నేతృత్వంలో విపరీతంగా చెమటోడ్చాడు. ఆహారపు అలవాట్లు మార్చుకున్నాడు. తనకిష్టమైన పరాటా, దొడ్డు శెనగల కూర ఊరిస్తున్నా నోరు కట్టేసుకున్నాడు. ప్రతిదీ తూకం వేసినట్టు తీసుకొని గొప్ప అథ్లెటిజం సాధించాడు. అందుకే అలసటే ఎరగక క్రికెట్ ఆడుతున్నాడు కోహ్లీ. తనలోని లోపాలను ఎప్పటికప్పుడు సవరించుకున్నాడు. ఆఫ్‌సైడ్ వెళ్లే బంతుల్ని వెంటాడటం తగ్గించుకున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ దేశాల్లోనూ శతకాల మోత మోగించాడు.
'సేన'పై మోతే
కెరీర్‌లో 422 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన విరాట్ 56.08 సగటు, 70 శతకాలతో 22,208 పరుగులు చేశాడు. గత దశాబ్దంలో ఇంతటి నిలకడ అతడి సమకాలీనులలో మరెవ్వరికీ లేదు. 2008, 2009, 2020లో కోహ్లీ చేసినవి 1,248 పరుగులు. వీటిని మినహాయిస్తే 2010-2019 మధ్య అతడు 69 శతకాలు, 20,960 పరుగులు సాధించడం విశేషం. ఇక 'సేన' దేశాల్లోనూ శతకాల మోత మోగించాడు.
ఆసీస్ గడ్డపై మొత్తంగా 52 మ్యాచుల్లో 54.50 సగటుతో 3052, ఇంగ్లాండ్‌లో 46 మ్యాచుల్లో 80.88 సగటుతో 2223, న్యూజిలాండ్‌లో 21 మ్యాచుల్లో 41.43 సగటుతో 953 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాలో 26 మ్యాచులాడి 64.78 సగటుతో 1490 (2009లో చేసిన 95 పరుగులు కలిపి) పరుగులు చేశాడు. అంటే విదేశాల్లో 2008 నుంచి కోహ్లీ 9,932 పరుగులు చేయగా సేన దేశాల్లోని వాటా 7,718. ఇందులో గత దశాబ్దిలో చేసిన పరుగులు 7,623. భూమ్మీద ఎక్కడ క్రికెట్ ఆడినా పరుగుల వరద పారించాడు కాబట్టే విరాట్ ప్రపంచంలోనే అత్యంత 'బిజీయెస్ట్ క్రికెటర్'గా అవతరించాడు.
ఇదీ చదవండి:ఐపీఎల్లో ఖరీదైన కెప్టెన్‌గా ధోనీ.. విలువ ఎంతంటే?