భారత్‌లో ఏటా వేసవి సెలవుల్లో పసందైన వినోదం అందించే ఐపీఎల్ క్రికెట్ టోర్నీ.. ఈసారి కరోనా పుణ్యమా అని యూఏఈకి తరలిపోయింది. అనేకానేక ఆంక్షల నడుమ ఇప్పటికే అక్కడికి చేరుకున్న అన్ని ఫ్రాంఛైజీలు క్వారంటైన్ సమయాన్నీ పూర్తిచేసుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. మరో రెండు వారాల్లో రసవత్తర పోరులో నువ్వా-నేనా అని తలపడేందుకు శాయశక్తులా స్వేదం చిందిస్తూ కష్టపడుతున్నాయి. అయితే, ఇప్పుడక్కడ ఆటగాళ్లంతా బయోసెక్యూర్ లాంటి భద్రతాపరమైన వాతావరణంలో ఉన్నారు.
కచ్చితమైన నియమాలను పాటిస్తున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా పెను ప్రమాదం పొంచి ఉందని తెలిసి జాగ్రత్త పడుతున్నారు. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే.. అది ఆర్థికంగానే కాక ఆటగాళ్ల ఆరోగ్యాలపైనా ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలోనే టోర్నీ సజావుగా సాగాలని అటు బీసీసీఐ, ఇటు యూఏఈ క్రికెట్ బోర్డులతో పాటు ఆయా ఫ్రాంఛైజీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
అదిరిపోయే ఏర్పాట్లు..
మొత్తం ఎనిమిది జట్లు. వందల మంది ఆటగాళ్లు, సహాయక సిబ్బంది. ఎక్కడికీ వెళ్లొద్దు, ఎవర్నీ కలవొద్దు. మైదానానికి వెళ్లామా, ప్రాక్టీస్ చేశామా, హోటల్‌కు వచ్చామా, గదిలో ఉన్నామా.. ఇదే ఇప్పుడక్కడ అందరికీ కొనసాగుతున్న దినచర్య. ఇలాగే కొనసాగితే ఆటగాళ్లకు శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఇబ్బందులు తలెతుత్తాయి.
ఎంతసేపూ మైదానంలో ప్రాక్టీస్ చేయడం, హోటల్ గదిలో ఒంటరిగా ఉండటమంటే కష్టతరమే. ఇలాంటి పరిస్థితులను పసిగట్టే ఆర్సీబీ జట్టు తమ ఆటగాళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆటగాళ్ల మనో వికాసానికి తగిన సౌకర్యాలు కల్పించింది. వారికోసం ఓ ప్రత్యేక ఆడిటోరియం లాంటి గదిని రూపొందించి.. అక్కడే పూల్ టేబుల్, ఫూస్‌బాల్ టేబుల్, ఎయిర్ హాకీ, ఎఫ్1 సిమ్యులేటర్ లాంటి ఇండోర్ గేమ్స్‌ను అందించింది. అలాగే సంగీత ప్రియుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంతో ఖాళీ సమయాల్లో కోహ్లీసేన అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. ఈ క్రమంలోనే ఆయా ఏర్పాట్లను చూపిస్తూ ఆర్సీబీ యూట్యూబ్‌లో ఓ వీడియోను విడుదల చేసింది. ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మీరూ ఓ లుక్కేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">