సెలక్షన్ కమిటీ ఛైర్మన్ సునీల్ జోషి, ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్‌ను బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తక్కువ అంచనా వేస్తున్నట్టు కనిపిస్తోందని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ విమర్శించాడు. ప్రతి విషయానికీ అతడే స్పందిస్తున్నాడని పేర్కొన్నాడు. దాదాలోని ఈ వైఖరి తనకు నచ్చడం లేదన్నాడు. రోహిత్ గాయం దగ్గర్నుంచి మరెన్నో అంశాలపై గంగూలీ స్పందిస్తుండటంపై ఈ వ్యాఖ్యలు చేశాడు వెంగ్‌సర్కార్.
"సెలక్టర్ల కమిటీ ఛైర్మన్ సునిల్ జోషీ బదులు గంగూలీయే మాట్లాడటం విస్మయం కలిగిస్తోంది. ఒక ఆటగాడిని ఎందుకు వదిలేశారు? మరో ఆటగాడిని ఎందుకు తీసుకోలేదు? ఇంకొకరు ఫిట్‌గా లేకున్నా అతడిని తీసుకొని మరొకరిని మాత్రమే ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో వంటివన్నీ ఆయనే వివరిస్తున్నాడు. ఐపీఎల్ షెడ్యూలు, తేదీలు, వేదికల గురించీ బ్రిజేశ్ పటేల్ కాకుండా దాదాయే మాట్లాడాడు. వారు సొంతగా నిర్ణయం తీసుకోగల సమర్థులు. వివరణ ఇచ్చుకోగలరు. వారిని దాదా తక్కువ అంచనా వేస్తున్నారా? లేదా ఆయనకే ఎక్కువ తెలుసని అనుకుంటున్నారా?" అని వెంగీ ప్రశ్నించాడు.
బీసీసీఐని మాజీ క్రికెటర్ నడిపిస్తే బాగుంటుందని గతంలో తాను అనుకున్నానని, గంగూలీ నుంచి ఎంతో ఆశించానని వెంగ్ సర్కార్ అన్నాడు. కానీ ఇప్పుడు తన మనసు మార్చుకున్నానని పేర్కొన్నాడు. ఇక రోహిత్ గాయం విషయంలోనూ బీసీసీఐ వైద్య బృంaదం అందరినీ గందరగోళంలోకి నెట్టేసిందని వెల్లడించాడు. బోర్డుకు చెందిన ఫిజియో అతడు ఫిట్‌గా లేడని ప్రకటిస్తే ముంబయి ఫిజియో మాత్రం బాగున్నాడని డిక్లేర్ చేశాడని విమర్శించాడు. ఇద్దరి ఫిజియోల మధ్య ఎందుకింత తేడా ఉందని అడిగాడు. ఇతరుల బదులు వివరణలు ఇస్తున్నాడని విమర్శించిన వెంగీయే మళ్లీ.. గంగూలీ ఇందుకు ఏమని బదులిస్తాడని ప్రశ్నించడం గమనార్హం.
ఇదీ చూడండి : 'ఎంత కాలం ఈ బుడగల్లో.. మా వల్ల కావట్లేదు'