సిడ్నీ టెస్టులో జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్న టీమ్ఇండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్.. తాజాగా ఆ విషయంపై స్పందించాడు. స్వదేశానికి వచ్చిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పలు అంశాలు వెల్లడించాడు. ఆన్-ఫీల్డ్ అంపైర్లు.. ఆటను మధ్యలో వదిలేసే అవకాశాన్ని తమ జట్టుకు ఇచ్చారని తెలిపాడు.
ఆస్ట్రేలియాలో జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నాను. నాకు న్యాయం చేకూరిందా.. లేదా.. అన్నది పక్కన పెడితే, కేసు విచారణలో ఉంది. సంఘటనపై కెప్టెన్‌కు ఫిర్యాదు చేసే బాధ్యత నాది. ఆ తర్వాత.. అంపైర్లు ఆటను మధ్యలో వదిలేసే అవకాశాన్ని మా జట్టుకు ఇచ్చారు. కానీ, అందుకు మా కెప్టెన్ అంగీకరించలేదు. మేము ఏ తప్పు చేయలేదు. ఆటను కొనసాగిస్తామని రహానే చెప్పాడు.
-మహమ్మద్ సిరాజ్, బౌలర్.
అయితే ఆస్ట్రేలియన్లు చేసిన వ్యాఖ్యలు తనను మానసికంగా దృఢంగా చేశాయే తప్ప.. తన ఆటపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయని సిరాజ్ తెలిపాడు.
సిరాజ్, సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. సిడ్నీ గ్రౌండ్లో ప్రేక్షకుల నుంచి రెండుసార్లు జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నారు. కొంతమంది ప్రేక్షకులు.. సిరాజ్‌ను 'బ్రౌన్ మంకీ' అని గేలి చేశారు. ఈ విషయంపై కెప్టెన్ రహానే.. ఫీల్డ్ అంపైర్లు పాల్ రిఫెల్, పాల్ విల్సన్‌లకు విషయాన్ని తెలిపాడు. అదే విధంగా జట్టు యాజమాన్యం మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్‌కు ఫిర్యాదు చేయగా.. సంఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణలు చెప్పింది.
వ్యాఖ్యలు చేసిన ఆరుగురిని గుర్తించిన ఆస్ట్రేలియా యాజమాన్యం.. వారికి తగిన శిక్ష పడేలా ప్రయత్నిస్తామని తెలిపింది.
కాగా, అరంగ్రేట సిరీస్‌లో సిరాజ్ విశేషంగా ఆకట్టుకున్నాడు. 13 వికెట్లు తీసి జట్టు చరిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయాన్ని నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇదీ చదవండి: సిరీస్‌లో తీసిన ప్రతి వికెట్ నాన్నకు అంకితం: సిరాజ్