ఈ ఏడాది ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. మినీ వేలానికి ముందు అట్టిపెట్టుకున్న, వదిలేసిన ఆటగాళ్లను ఇటీవలే ప్రకటించాయి. కొందరు స్టార్ క్రికెటర్లను తమ వద్దే ఉంచుకోగా, మరికొన్ని ఫ్రాంచైజీలు వదిలేసి ఆశ్చర్యపరిచాయి. అయితే కొన్ని జట్లు మాత్రం గతేడాది ఏమాత్రం ఆకట్టుకోని కొందరిని జట్టుతోనే ఉంచుకున్నాయి. అలా గత సీజన్లో ఆకట్టుకోలేకపోయినా, అవకాశం రాకపోయినా.. ఫ్రాంచైజీలు నమ్మకముంచిన ఆటగాళ్లెరో తెలుసుకుందాం.
క్రిస్ లిన్ (ముంబయి ఇండియన్స్)
డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ ఇప్పటికే స్టార్ బ్యాట్స్‌మెన్‌తో కళకళలాడుతోంది. గత సీజన్లో క్రిస్ లిన్‌ను 2 కోట్లు పెట్టి కొనుగోలు చేసినా అతడికి తుది జట్టులో చోటు లభించలేదు. సారథి రోహిత్ శర్మతో పాటు డికాక్ రూపంలో ఈ జట్టుకు మంచి ఓపెనింగ్ జోడీ కుదరడం వల్ల లిన్‌కు యూఏఈలో జరిగిన సీజన్లో అవకాశం రాలేదు. కానీ అతడిపై నమ్మకాన్ని ఉంచుతూ ఈ సీజన్లో కూడా లిన్‌ను అట్టిపెట్టుకుంది ఫ్రాంచైజీ.
ఇప్పటివరకు ఐపీఎల్లో 41 మ్యాచ్‌లు ఆడిన లిన్ 140.5 స్ట్రైక్ రేట్‌తో 1280 పరుగులు చేశాడు. ఒకవేళ ఇతడిని వదిలేస్తే వేలంలో మంచి ధర పలికేవాడు. కానీ ఈసారి కూడా లిన్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది.
మిచెల్ మార్ష్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)
మినీ వేలానికి ముందు మార్ష్‌ను అట్టిపెట్టుకుంటున్నట్లు ప్రకటించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఇతడిని గత సీజన్లో 2 కోట్లకు కొనుగోలు చేసింది యాజమాన్యం. యూఏఈ పిచ్‌లపై సత్తాచాటుతాడని నమ్మింది. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే గాయపడి సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. తర్వాత ఇతడి స్థానంలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇతడు అటు బంతితోనే కాక బ్యాట్‌తోనూ మంచి ప్రదర్శన చేశాడు. 7 మ్యాచ్‌లాడి 14 వికెట్లు సాధించి, 66 పరుగులు సాధించాడు. ఈ సీజన్లోనూ మార్ష్ ఉన్నా ఫ్రాంచైజీ హోల్డర్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.
సురేశ్ రైనా (చెన్నై సూపర్ కింగ్స్)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోనీ తర్వాత రెండో ప్రధాన ఆటగాడిగా కొనసాగుతున్నాడు సురేశ్ రైనా. గతేడాది జట్టుతో పాటు యూఏఈ బయల్దేరినా.. కుటుంబ కారణాల వల్ల సీజన్ ప్రారంభానికి ముందే స్వదేశానికి వచ్చాడు. ఆ తర్వాత జట్టు వెబ్సైట్ నుంచి రైనా పేరును తొలగించింది ఫ్రాంచైజీ. దీంతో ఇతడితో కాంట్రాక్టును చెన్నై ముగించిందంటూ వార్తలూ వచ్చాయి. కానీ అనూహ్యంగా అతడిని ఈ సీజన్ కోసం అట్టిపెట్టుకున్నట్లు ప్రకటించింది యాజమాన్యం. గతేడాది జరిగిన లీగ్‌లో రైనా లేని లోటు స్పష్టంగా కనిపించింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కరవై పాయింట్ల పట్టికలో ఏడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో రైనా జట్టులో ఉండటమే మంచిదని భావించిన ఫ్రాంచైజీ అతడిని అట్టిపెట్టుకుంది.
లుంగి ఎంగిడి (చెన్నై సూపర్ కింగ్స్)
ఈ దక్షిణాఫ్రికా పేసర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ అట్టిపెట్టుకుని అతడిపై ఉన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేసింది. 2019లో కనీస ధర 50 లక్షలకు ఇతడిని కొనుగోలు చేసింది ఫ్రాంచైజీ. కానీ గాయం కారణంగా ఇతడు ఆడలేదు. ఆ సీజన్లో ఎంగిడి స్థానంలో స్కాట్ కుగ్లిజెన్ను తీసుకుంది. మళ్లీ గతేడాది ఎంగిడిని అట్టిపెట్టుకుంది. కానీ వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ యూఏఈ గడ్డపై తీవ్రంగా నిరాశపర్చాడు. డెత్ ఓవర్లలో ధారాళంగా పరుగులిచ్చాడు. నాలుగు మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు సాధించాడు. 18.55 సగటుతో 167 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో టోర్నీ అర్ధభాగం తర్వాత జట్టులో చోటు కూడా కోల్పోయాడు. అయినా ఇతడిపై మళ్లీ నమ్మకముంచిన చెన్నై ఈసారి కూడా అట్టిపెట్టుకుంది.
కేన్ రిచర్డ్సన్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
డెత్ బౌలింగ్‌ను బలపర్చుకోవడానికి గత సీజన్లో కేన్ రిచర్డ్సన్ను 4 కోట్లకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కానీ తన భార్య.. బిడ్డకు జన్మనివ్వబోతున్న కారణంగా సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు కేన్. తర్వాత ఇతడి స్థానంలో తీసుకున్న స్పిన్నర్ ఆడం జంపా మంచి ప్రదర్శన చేశాడు. కాగా, ఈ సీజన్లో ఎలాగైనా టైటిల్ గెలవాలన్న కసితో ఉన్న ఆర్సీబీ రిచర్డ్సన్ను వదిలేస్తుందని అంతా భావించారు. కానీ అతడిపై మరోసారి నమ్మకముంచింది ఫ్రాంచైజీ. ఇంతకుముందు ఆర్సీబీ తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడిన కేన్.. 9.17 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు.