భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో నోబాల్స్‌ను మూడో అంపైర్ నిర్ణయించడం మంచి ఫలితాలను ఇచ్చింది. ఫలితంగా ఈ పద్ధతిని తొలిసారి ఐసీసీ టోర్నీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఈనెల 21 నుంచి ప్రారంభమయ్యే టీ20 మహిళా ప్రపంచకప్‌లో నోబాల్‌ను థర్డ్ అంపైరే ప్రకటించనున్నాడని తెలిపింది.
"బౌలర్ పాదాన్ని క్రీజు బయట పెట్టాడో లేదో గుర్తించడం మూడో అంపైర్ బాధ్యత. పాదం బయటపెడితే మూడో అంపైర్ ఫీల్డ్ అంపైర్లకు సమాచారం ఇస్తారు. నోబాల్‌గా ప్రకటిస్తారు. అంటే ఫీల్డ్ అంపైర్లు ఇకపై మూడో అంపైర్ సూచన లేకుండా నోబాల్ ప్రకటించరు. దీని వల్ల నోబాల్ తప్పిదాలు తగ్గుతాయి."
-ఐసీసీ ప్రకటన
ఈ పద్ధతిలో ఒకవేళ మూడో అంపైర్ నుంచి నోబాల్ ప్రకటన ఆలస్యమైతే బ్యాట్స్‌మన్ ఔట్‌ను ఫీల్డ్ అంపైర్లు వెనక్కి తీసుకుంటారు. ఈ సాంకేతికతను 2016లో పాక్, ఇంగ్లాండ్ సిరీసులోనూ పరీక్షించారు. ఇప్పుడు సాధ్యమైనన్ని మ్యాచుల్లో పరీక్షించాలని చూస్తున్నారు.
ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 మహీళా ప్రపంచకప్‌లో భాగంగా భారత్ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ సిడ్నీ వేదికగా ఈనెల 21న జరగనుంది.