భారత్‌లో బంగ్లాదేశ్ పర్యటనను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆ దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్. ఈ సిరీస్‌లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని.. బంగ్లా పర్యటనను ఆపేందుకు తరచూ ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నాడు. ఇటీవలే ఆటగాళ్లు చేసిన సమ్మె.. ఇందులో భాగమేనని స్పష్టం చేశాడు.
"భారత్ పర్యటనలో ఏం జరుగుతుందో మీడియా వారికి ఇంకా తెలియదు. కొద్ది రోజులు ఆగి చూడండి. ఈ పర్యటనను రద్దు చేసేందుకు కుట్ర జరుగుతోందన్న స్పష్టమైన సమాచారం నా దగ్గర ఉంది. నన్ను నమ్మండి. వారు సమ్మెకు దిగడాన్ని ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. వారితో ప్రతిరోజు మాట్లాడేవాడిని. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా హఠాత్తుగా సమ్మెకు దిగారు. చర్చల్లో వారి డిమాండ్లను అంగీకరించడం నేను చేసిన తప్పుగా భావిస్తున్నా. అలా చేసి ఉండకూడదు. సమ్మె విరమించిన తర్వాత చర్చలు జరపుతామని ఆటగాళ్లకు చెప్పా. డిమాండ్ల గురించి ఇతర బోర్డులతోనూ చర్చించాలని విజ్ఞప్తి చేశా. కానీ, మీడియా కూడా మాపై ఒత్తిడి తీసుకువచ్చింది’."
- నజ్ముల్ హసన్, బీసీబీ అధ్యక్షుడు
ఎందుకు?
మీరెందుకు ఇలా అనుకుంటున్నారని హసన్‌ను విలేకర్లు అడగగా.. తమీమ్ ఇక్బాల్ తొలుత మూడో టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉండనని చెప్పాడు.. తీరా చూస్తే అతడి భార్య డెలివరీ కారణంగా సిరీస్ మొత్తానికి దూరంగా ఉంటానన్నాడని తనకు చెప్పినట్లు స్పష్టం చేశాడు.
" తమీమ్ భార్య రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నందున కోల్‌కతాలో జరిగే టెస్టుకు మాత్రమే దూరంగా ఉంటానని తొలుత నాతో చెప్పాడు. కానీ, ఆటగాళ్లతో భేటీ తర్వాత నా గదికి వచ్చి.. సిరీస్ మొత్తానికి దూరంగా ఉంటానని అన్నాడు. ఎందుకని అడిగితే.. పర్యటనకు వెళ్లాలనుకోవట్లేదని చాలా సులభంగా చెప్పాడు"
- నజ్ముల్ హసన్, బీసీబీ అధ్యక్షుడు
డిమాండ్లకు అంగీకారం
ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఫీజు 35 వేల నుంచి లక్ష టాకాలకు పెంచడం, మైదానం, సహాయ సిబ్బంది వేతనాలు పెంపు, ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ల ప్రయాణ ఖర్చులు పెంచడం, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌ను తిరిగి ఫ్రాంచైజీ విధానంలోకి మార్చడం, ఢాకా ప్రీమియర్ లీగ్‌లో మార్పులు, జాతీయ కాంట్రాక్టు వేతనాలు పెంపు, ఆటగాళ్ల సంఘాల్లో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు లేకుండా చూడటం వంటి డిమాండ్లను పరిష్కరించాలని బంగ్లా ఆటగాళ్లు సమ్మెకు దిగారు. వాటిని నెరవేరుస్తామని బీసీబీ భరోసా ఇవ్వడం వల్ల సమ్మె విరమించారు.
ఈ పర్యటనలో భాగంగా భారత్‌తో బంగ్లాదేశ్.. మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది.