న్యూజిలాండ్‌లో శుక్రవారం జరిగిన దాడిలో 49 మంది చనిపోవడం ప్రపంచాన్నే కలవరపెట్టింది. కొద్దిపాటిలో బంగ్లాదేశ్ క్రికెటర్లు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. క్రికెటర్లు, ఆటగాళ్లపై బాంబు లేదా ఉగ్రదాడి జరగడం ఇదేమి కొత్త కాదు. 'మ్యూనిచ్ ఒలింపిక్స్' నుంచి ఈ దాడి వరకు ఇదే రీతిలో జరిగిన కొన్ని ఉదంతాలు చూద్దాం..
1972: మ్యూనిచ్ ఒలింపిక్స్..
1972, సెప్టెంబరు 5నఒలింపిక్స్పైజరిగిన దాడిక్రీడాలోకాన్ని నివ్వెరపోయేలా చేసింది. 11 మంది ఇజ్రాయిల్ అథ్లెట్లు, శిక్షకులను అత్యంత దారుణంగా చంపేశారు తీవ్రవాదులు.
1987: శ్రీలంకలో న్యూజిలాండ్ జట్టు పర్యటన..
మూడు టెస్టులు ఆడేందుకు శ్రీలంక వచ్చింది కివీస్ జట్టు. మొదటి మ్యాచ్‌కు ముందే వారు ఉంటున్న హోటల్ దగ్గర బాంబు దాడి జరిగింది. దీంతో ఈ సిరీస్ రద్దయింది. ఈ ఘటనలో 113 మంది ప్రాణాలు కోల్పోయారు.
2002: పాకిస్థాన్‌లో న్యూజిలాండ్ జట్టు పర్యటన..
పాకిస్థాన్‌లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పర్యటించింది. వారికి ఆతిథ్యమిచ్చిన హోటల్ బయట బాంబు దాడి జరిగింది. 12 మంది ప్రాణాలు విడిచారు. వెంటనే దేశానికి రావాలని కివీస్ క్రికెట్ బోర్డు ఆటగాళ్లను ఆదేశించింది. ఈ సిరీస్ రద్దయింది.
2009: పాకిస్థాన్‌లో శ్రీలంక జట్టు పర్యటన..
లాహోర్‌లో జరిగిన రెండో టెస్టు మూడో రోజు శ్రీలంక క్రికెటర్లు వస్తున్న బస్సుపై దాడి జరిగింది. క్రీడాకారులే లక్ష్యంగాసుమారు 12 మంది తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు ఆరుగులు పోలీసులు మృతి చెందారు. ఆరుగులు శ్రీలంక క్రికెటర్లకు తీవ్రగాయాలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్థాన్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగలేదు.
2010: ఆఫ్రికన్ జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్..
ఆఫ్రికన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు బస్సులో వెళ్తున్న టోగో జాతీయ ఫుట్‌బాల్ జట్టుపై దుండగులు దాడికి తెగబడ్డారు. అంగోలన్ ప్రావిన్స్ ప్రాంతంలో ఈ దుశ్చర్య జరిగింది. జట్టు సహాయ మేనేజర్, మీడియా అధికారి ఈ ఘటనలో మృతి చెందారు.
2019: న్యూజిలాండ్‌లో బంగ్లాదేశ్ జట్టు పర్యటన..
మూడో టెస్టు మొదలు కావడానికి ఒక రోజు ముందు క్రైస్ట్‌చర్చ్‌లోని మసీదులో ప్రార్థన చేసేందుకు వెళ్లారు బంగ్లాదేశ్ క్రికెటర్లు. అంతలో ఓ ఆగంతకుడు అక్కడ తుపాకీతో బీభత్సం సృష్టించాడు. ఇందులో 49 మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. క్రికెటర్లు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సిరీస్ రద్దయింది.
ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. అంతర్జాతీయ టోర్నీలకు పటిష్ట భద్రత కల్పించాలని ఆటగాళ్లు కోరుతున్నారు.